నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి ఏ విశేషాన్నీ పంచుకోలేదు టీం. తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వంలో తన వందో సినిమా చేస్తున్నట్లు నాగ్ ఒక కార్యక్రమంలో చెప్పాడే తప్ప.. ఆ చిత్రాన్ని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.

షూటింగ్ పూర్తి కావస్తున్నప్పటికీ ఇంకా టైటిల్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. ఆ సినిమా విశేషాల కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో ఇప్పుడు నాగ్ 101వ సినిమా గురించి చర్చ మొదలైంది. ఆ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్నాడనే వార్త ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఐతే ఈ న్యూస్ నాగ్ ఫ్యాన్స్‌ను అంతగా ఎగ్జైట్ చేయడం లేదు. అందుక్కారణం భాస్కర్ ట్రాక్ రికార్డే.

‘బొమ్మరిల్లు’తో సెన్సేషన్ క్రియేట్ చేశాక భాస్కర్ ఆ స్థాయి సినిమా మళ్లీ తీయలేకపోయాడు. రెండో చిత్రం ‘పరుగు’ బాగానే ఆడినా.. ఆ తర్వాత ఆరెంజ్, ఒంగోలు గిత్త, బెంగళూరు డేస్ రీమేక్ చిత్రాలతో డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు భాస్కర్. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తీస్తే అది యావరేజ్‌గా ఆడింది. ఆపై ‘జాక్’ మూవీని డైరెక్ట్ చేస్తే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాత కొంపముంచింది. 

ఈ నేపథ్యంలో టాలీవుడ్లో భాస్కర్‌కు ఇంకో ఛాన్స్ లభించడం కష్టమే అనుకున్నారంతా. కానీ అతడికి నాగార్జున లాంటి పెద్ద హీరో ఛాన్స్ ఇస్తున్నాడంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. నాగ్ నుంచి ఫ్యాన్స్ మాస్ సినిమాలు ఆశిస్తుంటే.. సక్సెస్‌లో లేని క్లాస్ డైరెక్టర్‌తో ఇప్పుడు సినిమా అవసరమా అన్నది వాళ్ల ప్రశ్న. మరి నిజంగా నాగ్.. భాస్కర్‌తో సినిమా చేయబోెతున్నాడా.. ఇది జస్ట్ రూమరా అన్నది తేలాల్సి ఉంది.