విశ్వంభరకు అసలు ఇరకాటం అదే

రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్ తగ్గిపోగా దాన్ని మళ్ళీ పూర్వ స్థితికి తేవాలంటే భారీ స్థాయిలో ప్రమోషన్లు చేయాల్సి ఉంటుంది. దాని కోసం చిరంజీవి ప్రత్యేకంగా సమయం కేటాయించడంతో పాటు అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. రిలీజ్ డేట్ ఇంకా నిర్ణయించలేదు కానీ యూనిట్ దసరా పండగను టార్గెట్ చేసుకోవాలని చూస్తోంది. ఇటీవలే ఈ టాక్ బయటికొచ్చింది.

అసలు ఇరకాటం వేరే ఉంది. అక్టోబర్ 15 రజనీకాంత్ జైలర్ 2 ప్రకటించారు. దాంతో క్లాష్ అయితే పక్క రాష్ట్రాల్లో విశ్వంభరకు సరైన రిలీజ్ దక్కదు. ముఖ్యంగా తమిళనాడు, కేరళలో స్క్రీన్లు దొరకవు. కర్ణాటకలో మేనేజ్ చేసుకున్నా రెవిన్యూ మీద ప్రభావం పడుతుంది. అలాని ఏపీ తెలంగాణలో ఏ సమస్య ఉండదని కాదు. రజనీ ఇమేజ్ లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు కానీ జైలర్ మీద తెలుగు ఆడియన్స్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. మొదటి భాగానికి వచ్చిన వసూళ్లే సాక్ష్యం.

దీంతో పోటీ వద్దనుకుని అక్టోబర్ మొదటి వారంలో వద్దామంటే వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఇటీవలే కర్చీఫ్ వేసింది. రెండో తేదీ లాక్ చేసుకుంది. దాంతో నేరుగా తలపెడితే ఎవరో ఒకరు ఎఫెక్ట్ అవుతారు. ఒకవేళ వెంకీ మూవీకి టాక్ బాగా వస్తే రెండు మూడు వారాలు థియేటర్లు నింపేస్తాడు. అప్పుడు విశ్వంభర బాగున్నా కూడా కలెక్షన్లు పంచుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకనుకుంటే అక్టోబర్ మూడో వారంకి షిఫ్ట్ అవ్వాలి. కానీ విజయదశమి సెలవులు అయిపోతాయి.

ముందైతే విశ్వంభర ఫైనల్ కాపీ చూసుకున్నాక నిర్ణయం తీసుకుందామని చిరంజీవి నిర్మాతలతో చెప్పినట్టుగా సమాచారం. ప్రస్తుతం బాబీ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఇంకా టైం ఫిక్స్ చేయలేదట. రిపేర్లు చేసిన తర్వాత విఎఫెక్స్ పనులు సంతృప్తికరంగా వచ్చాయని అంటున్నారు. ఆగస్ట్ 22 మెగాస్టార్ పుట్టినరోజు రానుంది. మెగా 158 అప్డేట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ విశ్వంభర లేకపోతే బాగుండదు. కనీసం విడుదల తేదీ అయినా పక్కాగా చెబితే అభిమానులు సంతోషపడతారు.