ఆల్ఫా సౌండ్ సరిపోవడం లేదు

మనం రావు బహదూర్, నాగబంధం గురించి మాట్లాడుకుంటున్నాం కానీ జూలై 3 అదే తేదీకి బాలీవుడ్ మూవీ అల్ఫా కూడా రిలీజ్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ నుంచి అలియా భట్ మనకు దగ్గర కావడంతో ఆమె సినిమాలను హిందీతో పాటు తెలుగులో డబ్బింగ్ చేస్తున్న వైనం చూస్తున్నాం. 2024లో జిగ్రాని చెప్పుకోదగ్గ స్థాయిలో ఏపీ తెలంగాణ రిలీజ్ చేశారు కానీ మన ఆడియన్స్ పట్టించుకోలేదు. కానీ అల్ఫా విషయంలో అంత స్పెషల్ ఇంటరెస్ట్ యష్ రాజ్ చూపించట్లేదు.

ముంబైతో పాటు ఉత్తరాది నగరాలు, తదితర చోట్ల ప్రమోషన్లు బాగానే చేస్తున్నారు. హీరోయిన్లు అలియా భట్, శార్వరి ప్రత్యక్షంగా థియేటర్లకు వెళ్లి అభిమానులను కలుసుకుంటున్నారు. కానీ సౌత్ స్టేట్స్ మీద దృష్టి పెట్టడం లేదు. టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఒక్కడే ఇన్స్ టాలో అల్ఫా ట్రైలర్ ని మెచ్చుకుంటూ స్టేటస్ పెట్టడం ఒక్కటే మనవైపు నుంచి వెళ్లిన సపోర్ట్. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ స్పై డ్రామా మీద నిర్మాత ఆదిత్య చోప్రా భారీగా ఖర్చు పెట్టారు.

కాకపోతే అసలు సమస్య ఏమిటంటే దురంధర్ దెబ్బకు గూఢచారి బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు చూసే దృక్పధం జనాల్లో మారిపోయింది. సహజంగా ఉంటేనే కనెక్ట్ అయ్యేలా ఉన్నారు. కానీ యష్ రాజ్ బ్యానర్ ఇప్పటిదాకా తీసిన టైగర్, వార్ సిరీస్ మొదలైనవన్నీ ఓవర్ ది టాప్ హీరోయిజంతో ఉంటాయి. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్స్ కాగా టైగర్ 3, వార్ 2 దారుణంగా దెబ్బ కొట్టాయి. అందుకే అల్ఫాని గత ఏడాది డిసెంబర్ నుంచి వాయిదా వేస్తూ ఇప్పటికి తెస్తున్నారు.

శివ్ రవైల్ దర్శకత్వం వహించిన అల్ఫాలో బాబీ డియోల్, అనిల్ కపూర్ లాంటి సీనియర్ క్యాస్టింగ్ పెద్దదే ఉంది. ఫిమేల్ ఓరియెంటెడ్ కావడంతో ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ లేరు. మొత్తం అలియా, శార్వరిల టూ విమెన్ షో కానుంది., ఇటీవలే వచ్చిన షాహిద్ కపూర్ కాక్ టైల్ 2 నిరాశ పరిచిన నేపథ్యంలో బాలీవుడ్ ట్రేడ్ ఆశలన్నీ అల్ఫా మీదే ఉన్నాయి. చూడాలి మరి ఏదైనా మేజిక్ చేస్తుందో లేక దురంధర్ మేనియాలో ఉన్న ఆడియన్స్ ని మెప్పించలేక తడబడుతుందో.