మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అనౌన్స్‌మెంట్లోనే అత్యంత క్రేజ్ తెచ్చుకున్న చిత్రాల్లో విశ్వంభర ఒకటి. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు వశిష్ఠ.. యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాను గుర్తు చేసే ఫాంటసీ జానర్.. ఇలా సినిమా మొదలైనపుడు ప్రతి విషయం ఎంతో క్యూరియాసిటీ పెంచాయి. కానీ ఈ సినిమా టీజర్ లాంచ్ అయ్యాక మొత్తం మారిపోయింది.
అందులో విజువల్స్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో టీం ఆత్మరక్షణలో పడిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ మీద మళ్లీ పని చేయడం మొదలుపెట్టడంతో సినిమా విపరీతంగా ఆలస్యం అయింది. మొదలైన మూడేళ్లకు కూడా విడుదలకు నోచుకోవట్లేదు.
ఐతే ఈ సినిమా షూటింగ్ అయితే ఏడాది కిందటే పూర్తయినట్లు వార్తలు వచ్చాయి. కానీ విజువల్ ఎఫెక్ట్స్ మీద మళ్లీ పని చేయడం, పూర్తి సంతృప్తి వచ్చే వరకు రాజీ పడకూడదని నిర్ణయించుకోవడంతోనే సినిమా ఇంత ఆలస్యం అవుతోంది.
వీఎఫెక్స్ కంటెంట్ పక్కాగా రెడీ అయితేనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని భావిస్తున్నారు. ఇలాంటి టైంలో మళ్లీ విశ్వంభర షూటింగ్ అంటూ వార్తలు వస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని.. కానీ ఆ కంటెంట్‌కు మ్యాచ్ అయ్యేలా కొత్తగా ఈ సినిమాలో ఒక ఎపిసోడ్‌ను జోడించాల్సి ఉందని.. అందుకోసం మళ్లీ కొన్ని ఒక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇందుకోసం చిరు అటు ఇటుగా ఒక వారం రోజులు కేటాయించాల్సి ఉందట. ప్రస్తుతం చిరు.. బాబీ దర్శకత్వంలో సినిమా కోసం పని చేస్తున్నారు. ఆ సినిమా షెడ్యూల్స్‌కు ఇబ్బంది రాకుండా విశ్వంభర కోసం కొన్ని రోజులు కేటాయించాలని చూస్తున్నారట. ఆ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి దసరాకు విశ్వంభరను ప్రేక్షకుల ముందుకు తేవాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates