2026 అర్ధసంవత్సరం… సరిపోని ఉత్సాహం

2026 సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఏదో నిన్నా మొన్నా కొత్త సంవత్సరం జరుపుకున్నట్టు ఉంది కానీ కాలం కర్పూరంలా ఎంత వేగంగా కరిగిపోతోందో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే కౌంట్ పరంగా సెంచరీ సినిమాలు రిలీజయ్యాయి కానీ కమర్షియల్ గా అన్ని వర్గాలను సంతోష పెట్టినవి సింగల్ డిజిట్ లో ఉండటం విచారకరం. అందులోనూ మధ్యలో ఒక రెండు నెలలు చాలా డ్రైగా గడిచిపోవడం ఎగ్జిబిటర్ వ్యవస్థను కుదిపేసింది.

కమర్షియల్ లెక్కల్లో చూసుకుంటే జనవరిలో సంక్రాంతికి విడుదలైన వాటిలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సాలిడ్ హిట్టు కొట్టి మంచి బోణీ చేసింది. దాన్ని ఫాలో అవుతూ ‘అనగనగా ఒక రాజు’ డీసెంట్ హిట్టు కొత్తగా ‘నారి నారి నడుమ మురారి’ అంత పోటీలోనూ సక్సెస్ అయ్యింది. ఊహించని విధంగా ‘రాజా సాబ్’ తీవ్రంగా నిరాశపరచగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ యావరేజ్ కన్నా కిందే నిలిచిపోయింది. ఫిబ్రవరిలో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఒక్కటే కొంచెం పర్వాలేదనిపించుకుంది.

బడ్జెట్లు ఎక్కువ పెట్టిన ఫంకీ, సీత పయనం, యుఫోరియా కనీసం బ్రేక్ ఈవెన్ కాలేకపోయాయి. విష్ణు విన్యాసం సైతం నిరాశపరిచింది. మార్చిలో ‘మృత్యుంజయ్’ కేవలం బిల్డప్ కే పరిమితమవగా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కాసిన్ని ఓపెనింగ్స్ తెచ్చేశాక చేతులు ఎత్తేసింది. ఏప్రిల్ లో ‘డెకాయిట్’ ఒకటే కాస్త ఆక్సీజెన్ లా పని చేసింది. ‘రాకాస’ డీసెంట్ స్టాంప్ వేయించుకునే ‘బైకర్’కు చప్పట్లు తప్ప డబ్బులు రాలేదు. మేలో గోదారి గట్టుపైన, జెట్లీ, గాయపడ్డ సింహం మొదలైనవి ఆర్భాటాలకే పరిమితమయ్యాయి.

జూన్ లో ‘పెద్ది’ ఏపీ తెలంగాణ వరకు ప్రాఫిటబుల్ వెంచర్ గా నిలవగా బయట నిరాశపరిచింది. సమంత ‘మా ఇంటి బంగారం’ పుణ్యమాని నెలాఖరు మళ్ళీ ఊపందుకుంది. ‘సింగ్ గీతం’ని అందరు శభాష్ అన్నారు తప్పించి కలెక్షన్లు ఇవ్వలేదు. డబ్బింగులు విషయానికి వస్తే వీరభద్రుడు, దురంధర్ రివెంజ్ మాత్రమే లాభాలు ఇచ్చాయి. దృశ్యం 3, కెడి డెవిల్ లాంటివి త్వరగా టపా కట్టేశాయి. మొత్తంగా చూసుకుంటే అర్ధ సంవత్సరంలో శుభాల కంటే నిట్టూర్పులే ఎక్కువగా ఉన్నాయనేది వాస్తవం.