ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సినీ సందడి నెలకొంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా చిత్రం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ‘ఎన్‌బీకే112’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు వెలగపూడిలోని బిట్స్ పిలానీ ప్రాంగణంలో వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆయన క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేయగా, చిత్ర బృందం తొలి షాట్‌ను చిత్రీకరించింది. దీంతో కార్యక్రమం సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో సందడిగా సాగింది.
కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురేష్, చెరుకూరి సుధాకర్, దర్శకుడు కొరటాల శివ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. అభిమానులు, సినీ ప్రముఖుల రాకతో వేడుకకు మరింత కళ వచ్చింది.
ఈ సందర్భంగా నిర్మాత చెరుకూరి సుధాకర్ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు భారీ వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2027 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
బాలకృష్ణ-కొరటాల శివ కలయికలో తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజధాని అమరావతిలో ఇంత పెద్ద సినీ ప్రారంభోత్సవం జరగడం కూడా ప్రత్యేకతగా మారింది. సినీ పరిశ్రమకు అమరావతి వేదిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates