దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని సాధ్యం చేసి చూపించింది. ఈ చిత్రానికి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అన్న సంగతి తెలిసిందే. కానీ 94 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యల దృష్ట్యా లొకేషన్ కు వచ్చి వందల మందిని కో ఆర్డినేట్ చేస్తూ సినిమా తీసే స్థితిలో లేరు. ఇటీవల ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ చక్రాల కుర్చీలో కనిపించరాయన. ఆ స్థితిలో ఆయన సినిమా ఎలా తీయగలిగారు అనే సందేహం అందరికీ కలిగింది.
అలా అని సినిమా అంతా నాగ్ అశ్విన్ అండ్ టీం తీసేసి సింగీతం పేరు వేయడం కూడా జరగలేదు. వీళ్లు పడే కష్టం వీరు పెద్దప్పటికీ సింగీతం దర్శకుడిగా తన వంతు బాధ్యత నిర్వర్తించారు. ఆయన చెన్నైలోని తన ఇంట్లోనే ఉంటూ ఈ సినిమాను ఎలా డైరెక్ట్ చేశారో స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
“నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి నేను దర్శకత్వం వహించాలని కోరారు. నాకు ఇప్పటికీ దర్శకత్వం వహించే ఉత్సాహం ఉంది. అయితే నా వయస్సు దృష్ట్యా సాంకేతిక సహకారంతో ఆన్‌లైన్‌లో సినిమా తెరకెక్కించే విధానాన్ని నాగ్ అశ్విన్ ఏర్పాటు చేశారు. నా హోమ్ థియేటర్‌లో కూర్చుని, షూటింగ్ లొకేషన్‌లో జరుగుతున్న ప్రతిదీ ప్రత్యక్షంగా చూస్తూ నటీనటులకు సూచనలు ఇచ్చేవాడిని.
అక్కడి కెమెరాలు, మానిటర్లు అన్నీ నాకు కనెక్ట్ అయ్యేవి. ఇంట్లో నుంచే మొత్తం సినిమాను దర్శకత్వం వహించాను. ఇది అద్భుతమైన మేనేజ్‌మెంట్. ఇలాంటి విధానాన్ని సాధ్యంచేసింది నాగ్ అశ్విన్ మాత్రమే” అని సింగీతం చెప్పారు. అంటే సింగీతం స్క్రిప్ట్ దగ్గర పెట్టుకుని ఆన్లైన్ ద్వారా సూచనలు ఇస్తుంటే నాగ్ అశ్విన్, సంకల్ప్ గోరా.. ఈ దిగ్గజ దర్శకుడి కలల ప్రాజెక్టుకు దృశ్యరూపం ఇచ్చారని అర్థం అవుతోంది. గత శుక్ర వారం రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందనే వస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates