టాలీవుడ్ లో ఉన్న చాలా అగ్ర నిర్మాణ సంస్థలు బిజినెస్ లెక్కల ఆధారంగానే సినిమాలు తీస్తున్న మాట వాస్తవం. హీరో మార్కెట్ ఎంత, సబ్జెక్టులో సరిపడా ఎలివేషన్లు ఉన్నాయా లేవా, పుష్ప కాంతార తరహాలో మాస్ జనాన్ని ఊపేసే కంటెంట్ దర్శకుడు ఇస్తున్నాడా లేదానే క్యాలికులేషన్లలో కాంబోల మీద విపరీతంగా ఆధారపడుతున్నాయి. విచిత్రం ఏమిటనే వీటికి సక్సెస్ రేట్ చాలా తక్కువ. పది సినిమాల్లో రెండు ఆడితే మిగిలినవి కనీసం బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోతున్నాయి.
కానీ వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు దీనికి భిన్నంగా సాగుతున్నాయి. నిన్న విడుదలైన సింగ్ గీతంని ఒక లెజెండరీ దర్శకుడికి తామిచ్చే కానుకగా అంత బడ్జెట్ తో తీసి థియేటర్లలో రిలీజ్ చేశారు. ప్రశంసలు దక్కుతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆక్యుపెన్సీలు బాగున్నాయి. కమర్షియల్ కోణంలో ఇది అద్భుతాలు చేస్తుందో లేదో ఓ వారం ఆగితే తెలుస్తుంది కానీ అశ్వినిదత్, నాగ్ అశ్విన్, స్వప్న, ప్రియాంకలు మూవీ లవర్స్ మనసు గెలుచుకుంటున్నారు.
ఇంత ఖర్చుతో ఇదే సింగ్ గీతంని వేరే సంస్థ తీసే సాహసం చేస్తుందా అంటే సమాధానం దాదాపుగా కాదనే వస్తుంది. ఎందుకంటే రిస్క్ కళ్ళ ముందు కనిపిస్తోంది కాబట్టి. సింగ్ సింగీతంలో స్టార్లు లేరు. దర్శకుడి వయసు 94. సినిమాలో మాటలకు కాదు పాటలకు ప్రాధాన్యం ఇస్తూ కథనాన్ని నడిపించారు. దేవిశ్రీ ప్రసాద్ ప్రాణం పోశాడు. ఆర్టిస్టులు తమ వంతు కృషి చేశారు. సగటు ఆడియన్స్ కి ఇది కనెక్ట్ అయినా కాకపోయినా ఒక గొప్ప ప్రయత్నంగా చరిత్రలో నిలిచిపోతుంది.
ఇదే కాదు గతంలో మహానటి సావిత్రి జీవితాన్ని తెరకెక్కించాలని కంకణం కట్టుకున్నప్పుడు కన్నీళ్ల గాదని ఎవరు చూస్తారనే కామెంట్స్ వచ్చాయి. అయితే నాగ్ అశ్విన్ ఒక మాస్టర్ పీస్ ఆవిష్కరించారు. కల్కి బడ్జెట్ హద్దులు దాటినప్పుడు భయపడలేదు. ఫలితమే ఒక గొప్ప బ్లాక్ బస్టర్. సీతా రామం, జాతిరత్నాలు అదే కోవలోకి వస్తాయి. ఛాంపియన్ మీద అంత ఖర్చు పెట్టడాన్ని మనం ఆ కోణంలోనే చూడాలి. అందుకే రిస్క్ విషయంలో స్వప్న, వైజయంతి తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
