బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో ఎక్కువ చిత్రాలు చేసిన హీరోయిన్లు పెద్దగా కనిపించరు. ఒకట్రెండు సినిమాలతో మాయమైపోయిన వాళ్లే ఎక్కువ. ఐతే జాన్వి కపూర్ అలా కాకుండా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుందేమో అనిపించింది. తల్లి శ్రీదేవికి తెలుగు చిత్రాలతో ఉన్న కనెక్షన్ దృష్ట్యా ఆమెకు కూడా ఈ ఇండస్ట్రీ మీద సానుకూల భావన ఉన్నట్లే కనిపించింది.
తొలి సినిమా దేవర తర్వాత.. ఎక్కువ గ్యాప్ లేకుండా తెలుగులో పెద్ది మూవీలో నటించింది. ఈ రెండూ మంచి ఫలితాలనే అందుకున్నాయి. దేవర ఓవరాల్‌గా మంచి విజయమే సాధించగా.. పెద్ది తెలుగు రాష్ట్రాల వరకు హిట్ స్టేటస్ అందుకుంది. ఇలా రెండు హిట్ల తర్వాత ఏ హీరోయిన్ అయినా.. ఇక్కడ మరిన్ని సినిమాలు చేయాలనే అనుకుంటుంది. కానీ జాన్వి మాత్రం మళ్లీ తెలుగు మూవీలో కనిపించడం సందేహంగానే ఉంది.
దేవర, పెద్ది సినిమాలు మంచి ఫలితాలను అందుకున్నా.. జాన్వికి మాత్రం అంత మంచి పేరేమీ రాలేదు. రెండింట్లోనూ ఆమెను గ్లామర్ డాల్‌గానే వాడుకున్నారు. ముఖ్యంగా పెద్దిలో అయితే ఆమె పాత్ర మరీ తేలిపోయింది. తనను ప్రెజెంట్ చేసిన తీరు మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. వివిధ ఇండస్ట్రీల నుంచి నెగెటివ్ కామెంట్స్ వచ్చే స్థాయిలో జాన్వి పాత్ర మిస్ ఫైర్ అయింది. ఆమె మీద తీసిన కొన్ని సీన్లు రిలీజ్ తర్వాత కట్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ ఫీడ్ బ్యాక్ అంతా జాన్వికి చేరకుండా ఉండదు.
బాలీవుడ్లో విభిన్నమైన పాత్రలతో మంచి నటిగానూ పేరు సంపాదించింది జాన్వి. కానీ టాలీవుడ్ దర్శకులు ఆమెను ఆ కోణంలో చూడకుండా అందాల ప్రదర్శన చేసే పాత్రలే డిజైన్ చేశారు. జాన్వి ఇమేజ్ కూడా దెబ్బ తినేలా చేశారు. దీంతో టాలీవుడ్ పట్ల జాన్వి ప్రతికూల అభిప్రాయం ఏర్పరుచుకుని ఉంటే ఆశ్చర్యం లేదు. మరోవైపు ప్రేక్షకుల నుంచి కూడా ఆమె పట్ల సానుకూల స్పందన రాని నేపథ్యంలో ఇకపై తెలుగు ఫిలిం మేకర్స్ కూడా ఆమె వైపు చూస్తారా అన్నది డౌటే.
Gulte Telugu Telugu Political and Movie News Updates