వంద దేవుళ్ళు కలిసి హిట్ ఇస్తారా

వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ వల్లే హీరో విజయ్ ఆంటోనీకి ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. తర్వాత పదుల సంఖ్యలో అతని సినిమాలు నిరాశపరిచినా ఆ బ్రాండ్ మీద బిజినెస్ చేస్తున్నారు నిర్మాతలు. మధ్యలో బిచ్చగాడు 2 వచ్చి కమర్షియల్ గా కొంచెం సేఫ్ చేసింది కానీ మిగిలినవన్నీ లాస్ వెంచర్లే. ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత బిచ్చగాడు దర్శకుడు శశి తన హీరోతో చేతులు కలిపాడు.

వచ్చే వారం జూన్ 19 వంద దేవుళ్ళు విడుదల కానుంది. నిన్న ట్రైలర్ వదిలారు. కాన్సెప్ట్ ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త దగ్గర లేనప్పుడు పెద్దయ్యాక పిల్లల వల్ల ఒక మహిళ పడే మానసిక సంఘర్షణని కథగా రాసుకున్నట్టు కనిపిస్తోంది. విజయ్ ఆంటోనీ పాత్ర చనిపోతుందా లేక ఇంకేదైనా ట్విస్టు ఉందానేది రివీల్ చేయలేదు కానీ ఎమోషన్ ని తల్లి కొడుకుల మధ్య ఎక్కువ నడిపించడం వల్ల అలాంటి ట్విస్టు ఉందేమోననే అనుమానం కలుగుతోంది.

ఇప్పుడు విజయ్ ఆంటోనీకి పెద్ద హిట్టు ఇవ్వాల్సిన బాధ్యత వంద దేవుళ్ళ మీద ఉంది. బిచ్చగాడులో బ్లాక్ బస్టర్ మదర్ సెంటిమెంట్ పాట పల్లవినే టైటిల్ గా పెట్టుకుని మాస్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోటీ తక్కువేం లేదు. సమంత మా ఇంటి బంగారం, గీతా ఆర్ట్స్ పంపిణి చేస్తున్న దీవానాలు వెరైటీ ప్రమోషన్లతో ఓపెనింగ్స్ తెచ్చుకునే పనిలో పడ్డాయి. వంద దేవుళ్ళను పబ్లిసిటీతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నిర్మాతల మీదుంది.

ఒక్క విషయంలో విజయ్ ఆంటోనీని మెచ్చుకోవచ్చు. హిట్టు ఫ్లాపు పక్కపెడితే తన స్వంత డబ్బులతో చాలా సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. కమర్షియల్ గా ఎంత సేఫ్ అయ్యాడనేది పక్కనపెడితే వీలైనన్ని ఎక్కువ మూవీస్ ఇవ్వాలనే లక్ష్యంతో ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాడు. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చినా వంద దేవుళ్ళతో మళ్ళీ లూప్ లైన్ లోకి వస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. వంద దేవుళ్ళలో విజయ్ ఆంటోనీ కన్నా హీరోయిన్ శ్వాసిక హైలైట్ కావడం గమనించాల్సిన విషయం.