పెద్ది ప్రమోషన్స్ టైంలో జగపతిబాబు బోలెడు ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. మెయిన్ ఈవెంట్స్ కి వచ్చారు. ఎన్నో విశేషాలు పంచుకున్నారు. అన్నింటికన్నా ఎక్కువగా నా కెరీర్ టాప్ సిక్స్ లో ఇది ఉంటుందని, ఇంకా చెప్పాలంటే నెంబర్ వన్ అయినా ఆశ్చర్యం లేదని చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. అప్పలసూరిగా అయన మేకోవర్ చెందిన విధానం, జనంలోకి వెళ్లినా గుర్తుపట్టని వైనం ఇవన్నీ వీడియోల రూపంలో వదిలారు. ఫైనల్ గా పెద్ది వచ్చేసింది.
సినిమాలో జగపతిబాబు చాలా షాకింగ్ లుక్ తో కనిపించడమే కాదు మంచి నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. అయితే ఇచ్చిన స్టేట్ మెంట్, తెరమీద కనిపించిన దానికి పొంతన ఉందా అంటే పూర్తిగా ఔననే సమాధానం రాదు. ఎందుకంటే అప్పలసూరి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. ఎమ్మెల్యేని నిలదీసే సీన్, ఇంటర్వెల్ కు దారి తీసే ఎపిసోడ్ లోనే ఆయన పెర్ఫార్మన్స్ పీక్స్ లో కనిపిస్తుంది. మిగిలినవన్నీ కొత్తగా అనిపించని మాములు సన్నివేశాలే.
ఇది కెరీర్ టాప్ వన్ అని జగపతిబాబు భావించి ఉండొచ్చు కానీ అభిమానులు మాత్రం కాదనే అంటున్నారు. ఎందుకంటే అంతఃపురం ఎప్పటికీ నెంబర్ వన్ గా ఉంటుంది. ఆ తర్వాత గాయం, శుభలగ్నం, అల్లుడుగారు వచ్చారు, పెద్దరికం లాంటి ల్యాండ్ మార్క్ మూవీస్ చాలా ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో చూసుకున్నా రంగస్థలం, లెజెండ్, నాన్నకు ప్రేమతోలో కనిపించిన స్పేస్, పెద్దిలో పాతిక శాతం కూడా లేదన్నది వాస్తవం. జనాల అభిప్రాయం కూడా అదే.
పెద్దిలో జగపతిబాబు బెస్ట్ ఇచ్చిన మాట నిజమే కానీ అందరూ మాట్లాడుకునే స్థాయిలో ఆ క్యారెక్టర్ రాలేదనేది మూవీ లవర్స్ ఒపీనియన్. ఇంకా చెప్పాలంటే శివరాజ్ కుమార్ పోషించిన గౌర్ నాయుడు హైలైట్ అయినంతగా కూడా అప్పలసూరి గుర్తింపు పొందలేదన్నది వాస్తవం. ఒకవేళ స్పేస్ ఎక్కువ దొరికి ఉంటే చెలరేగిపోయేవారేమో కానీ కథ పరంగా అంత స్కోప్ అయితే దక్కలేదు. సక్సెస్ మీట్ లో దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఏమైనా మాట్లాడతారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates