గ్లామర్ కోసమే జాన్వీ పాత్రలు సృష్టిస్తున్నారా

అతిలోకసుందరిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీదేవి అంటే ఎప్పటికీ చెక్కుచెదరని పేరు. అలాంటి గొప్ప నటికి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ హిందీలో పెర్ఫార్మన్స్ అవకాశం ఉన్న పాత్రలు చాలానే చేసింది. గుంజన్ సక్సేనా, గుడ్ లక్ జెర్రీ, మిలి, బవల్, ఉలజ్ లాంటి ఎన్నో అవకాశాలు సంపాదించింది. వీటి కమర్షియల్ లెక్కలు, హిట్టు ఫ్లాపు పక్కన పెడితే నటిగా తన సత్తా చాటినవే. ఇక మన తెలుగుకు వద్దాం.

జాన్వీ ఇప్పటిదాకా చేసిన సినిమాలు రెండు. దేవరలో సెకండాఫ్ కే పరిమితం చేసిన దర్శకుడు కొరటాల శివ ఆమెను గ్లామర్ షోకు వాడుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. రెండు సాంగ్స్ తప్ప జాన్వీకి వ్యక్తిగతంగా ఒరిగిందేమి లేదు. బ్లాక్ బస్టర్ లో భాగమయ్యానన్న ఆనందం తప్ప. ఇప్పుడు పెద్ది వంతు వచ్చింది. స్టోరీ మళ్ళీ రిపీట్ అయ్యింది. అచ్చియమ్మగా పైట గాల్లోనే ఉంచేసే పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు చేయమన్నది పొల్లు పోకుండా చేసి చూపించింది.

క్లైమాక్స్ కు ముందు ఒక రెండు సీన్లు ఇచ్చారు కానీ జాన్వీకి వాటి వల్ల కలిగిన ప్రయోజనం తక్కువే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. శ్రీదేవి కెరీర్ లో ఐకానిక్ అనిపించే పాత్రలు టాలీవుడ్ లోనే ఉన్నాయి. పదహారేళ్ళ వయసు, ప్రేమాభిషేకం, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఆఖరి పోరాటం, కృష్ణతో నటించిన ఎన్నో సూపర్ హిట్లు చరిత్రలో కల్ట్ క్లాసిక్స్ గా నిలిచాయి. వీటిలో మాస్ చిత్రాలు లేకపోలేదు. అయినా సరే ప్రాధాన్యం ఉన్నవే.

ఎటొచ్చి ఆమె కూతురు జాన్వీకి సరైన క్యారెక్టర్లు డిజైన్ చేయడంలో మన డైరెక్టర్లు విఫలమవుతున్న మాట వాస్తవం. పెద్దిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఒక వ్యక్తి కూతురిని కేవలం స్కిన్ షో కోసం అంతగా హైలైట్ చేయడం ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చడం లేదన్నది వాస్తవం. ఎంజాయ్ చేస్తున్న మాస్ లేకపోలేదు కానీ భారీ రెమ్యునరేషన్ పుచ్చుకున్న నటిని వాడుకునే విధానం ఇదైతే కాదు. బన్నీ రాకాలో కూడా జాన్వీ ఉందని టాక్. అందులో అయినా స్కోప్ దక్కుతుందేమో చూడాలి.