హైదరాబాద్ ఐమాక్స్ గురించి అనేక సందేహాలు

తెలుగు సినీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత ఆకర్షణీయమైన స్క్రీన్లో సినిమా చూసే అవకాశం హైదరాబాదీలకు దక్కబోతోంది. ఐమాక్స్ స్క్రీన్ ఈ ఏడాది చివర్లోనే హైదరాబాద్‌లో కొలువుదీరబోతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఒకప్పుడు సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ ఉన్న చోటే ఈ స్క్రీన్‌ను తీసుకురాబోతున్నారు.

ఇప్పటికే హైదరాబాద్‌లో టాప్ మల్టీప్లెక్సుల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఏఎంబీ సంస్థే.. ఇక్కడ కూడా మల్టీప్లెక్స్ నిర్మిస్తోంది. ఏషియన్ సునీల్, మహేష్ బాబులకు తోడు దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి రానా కూడా ఐమాక్స్ ప్రాజెక్టులో భాగం అవుతున్నారు. ఐతే ఇక్కడి ఐమాక్స్ స్క్రీన్ ఎలా ఉంటుందనే విషయంలో క్లారిటీ లేదు. నిజానికి ఏఎంబీ క్లాసిక్‌లో ఐమాక్స్ స్క్రీన్ నిర్మాణం ఇంకా మొదలే కాలేదు.

ఒక భారీ బిల్డింగ్ కట్టారు. అందులో స్క్రీన్ పార్టిషన్స్ ఇంకా జరగలేదు. త్వరలో ఐమాక్స్ టీం ఇక్కడికి రానుంది. స్క్రీన్‌ డిజైన్ ఎలా ఉండాలన్నది నిర్ణయించబోతోంది.
ఐమాక్స్ స్క్రీన్లలో ది బెస్ట్ అంటే 1.43:1 రేషియోతో ఉండే గ్రాండ్ స్క్రీనే. ప్రపంచంలో ది బెస్ట్ మూవీ ఎక్స్‌పీరియన్స్ అంటే ఈ స్క్రీన్లోనే అన్న విషయంలో మరో అభిప్రాయం లేదు. కానీ ఇండియాలో ఇలాంటి స్క్రీన్ ఒక్కటీ లేదు.

ఇదే రేషియలో ఐమాక్స్ 70 ఎంఎం స్క్రీన్ కూడా గొప్ప అనుభూతినే పంచుతుంది. కానీ హైదరాబాద్‌లో వస్తున్న ఐమాక్స్ స్క్రీన్ ఈ రెండు రకాల్లో ఏదీ కాదని సమాచారం. 1.90:1 రేషియో స్క్రీన్‌ను ఇక్కడ నిర్మించబోతున్నారని తెలుస్తోంది. 1.43:1 రేషియో లెవల్ కాకపోయినా.. దాంతో పోలిస్తే ఇమేజ్ కొంచెం క్రాప్ అయినా.. ఇది కూడా మంచి అనుభూతినే ఇస్తుంది. విజువల్స్, సౌండ్ అదిరిపోతాయి.

ఇక ఐమాక్స్ స్క్రీన్లలో స్కోప్ ఉన్నట్లయితే.. రెగ్యులర్ స్క్రీన్లతో పోలిస్తే అదేమంత ప్రత్యేకంగా ఉండదు. ఇమేజ్ చాలా క్రాప్ అవుతుంది. ఇమేజ్ క్లారిటీ, సౌండ్ కూడా అంత గొప్పగా ఉండదు. మొత్తానికి హైదరాబాద్‌లో రాబోయే ఐమాక్స్ స్క్రీన్ కచ్చితంగా ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించేదే అని.. ఈ స్క్రీన్ వచ్చాక ఏఎంబీ క్లాసిక్ తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ సినిమా హబ్‌గా మారడం ఖాయమని అంటున్నారు. దీని తర్వాత హకీంపేటలో ఇంకా పెద్ద ఐమాక్స్ స్క్రీన్ తీసుకురావాలని ఏఎంబీ గ్రూప్ భావిస్తోంది.