పది మెట్లు ఎక్కేసిన రామ్ చరణ్

పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటుంది. అదే రామ్ చరణ్ పెర్ఫార్మన్స్. ముందు నుంచి టీమ్ సభ్యులు, సాంకేతిక నిపుణులు చెబుతున్న మాట. తన నటనకు జాతీయ అవార్డు ఖచ్చితంగా వస్తుందని. అంచనాలు పెరిగేందుకు ఇదీ ఒక కారణం అయ్యింది. అన్నట్టుగానే నిన్న ప్రీమియర్ షోస్ చూశాక వెలువడుతున్న అభిప్రాయం దాన్ని బలపరిచేలా ఉంది.

నిజంగానే రామ్ చరణ్ నటన నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎమోషన్స్ ని పండిస్తూ తను చూపించిన వైవిధ్యం ఇప్పటి స్టార్లకు అంత ఈజీగా దొరకదనే స్థాయిలో ఉంది. ఎందుకంటే గేమ్ ఛేంజర్, రచ్చ, నాయక్ లాంటివి రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్లు. అందరూ చేసేవే చూసేవే. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవడానికి ఏం ఉండదు. కానీ పెద్ది లాంటివి మళ్ళీ మళ్ళీ రావు. అందరు దర్శకులు రాయరు. ప్రధానంగా చెప్పే సాహసం చేయరు.

రంగస్థలంతో పోలిక చేసుకుని చూసినా పెద్దిలో చరణ్ ఇంకా ఎదిగాడు. ఉదాహరణకు శుభలేఖ, విజేతలో ఉదాత్తమైన పాత్రల్లో కనిపించిన చిరంజీవి ఆపద్బాంధవుడుతో ఊహించనంత గొప్పగా కంటతడి పెట్టించారు. ఇప్పుడు చరణ్ లోనూ ఆ మెచ్యూరిటీ కనిపిస్తోంది. పెద్దిలో అసలే సమస్యలు లేవని కాదు. ఉన్నాయి. కానీ ఇక్కడ టాపిక్ కేవలం చరణ్ నటన గురించి మాత్రమే కాబట్టి ఆ కోణంలో చూసుకుంటే అభిమానులు సంతోషంగా ఉన్నారు.

సుకుమార్ తో చేయబోయే సినిమాలో ఇంతకన్నా ఎక్కువ స్కోప్ ఉంటుందో లేదో చెప్పలేం కానీ పెద్ది అంత ఎమోషన్ పదే పదే మళ్ళీ ప్లే చేయడం మాత్రం చెప్పినంత ఈజీగా ఉండదు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా దర్శకుడు బుచ్చిబాబు తన రెండో సినిమాలో రామ్ చరణ్ నుంచి నటన రాబట్టుకున్న విధానం మాత్రం పూర్తి ప్రశంసలకు అర్హత సాధించిందని చెప్పాలి. ఫ్యాన్స్ ఒక్క శాతం నిరాశపడకుండా వాళ్ళ హీరో నుంచి బెస్ట్ బయటికి తీసి వాళ్లకు కానుక ఇచ్చాడు.