సినిమా థియేటర్ లో స్పిరిట్ షూట్ ఎలాగయ్య వంగా

టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్‌లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు ప్రేక్షకులు బలంగా కోరుకుంటూ ఉంటారు. ఐతే ఈ డిమాండును చాలామంది హీరోలు పట్టించుకోవట్లేదు కానీ.. మన ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్ మాత్రం చకచకా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ‘ది రాజాసాబ్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన రెబల్ స్టార్.. చివర్లో ‘ఫౌజీ’ చిత్రంతో రాబోతున్నాడు.

వచ్చే ఏడాది వేసవికి ‘స్పిరిట్’ మూవీ షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. ‘ఫౌజీ’ చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేసిన ప్రభాస్.. ‘స్పిరిట్’ కోసం ఎక్కువ డేట్లు ఇచ్చి సాధ్యమైనంత త్వరగా దాన్ని ఫినిష్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం ‘స్పిరిట్’ చిత్రీకరణలోనే ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూట్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటికి వచ్చింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం బిగ్గెస్ట్ సింగిల్ స్క్రీన్ అయిన విమల్ 70 ఎంఎం థియేటర్లో ‘స్పిరిట్’ చిత్రీకరణ జరుపుతున్నారు.

సినిమాలో ఒక కీలక సన్నివేశాన్ని థియేటర్ నేపథ్యంలో డిజైన్ చేశాడట దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఆ సీన్ కోసం ఐకానిక్ థియేటర్ విమల్‌నే ఎంచుకుంది చిత్ర బృందం. అక్కడ కొన్ని రోజుల పాట సినిమాల ప్రదర్శన ఆపేసి, ‘స్పిరిట్’ షూట్ జరుపుతున్నారు. ఈ సీన్లో పెద్ద ఎత్తున జనం కూడా ఉంటారట. అందుకోసం ప్రభాస్ అభిమానులనే పిలిపించారట.

థియేటర్ నేపథ్యంలో అభిమానుల మధ్య ప్రభాస్ ఓ సన్నివేశంలో నటించడం, అది కూడా సందీప్ రెడ్డి సినిమాలో కావడంతో ఈ సీన్ పట్ల క్యూరియాసిటీ పెంచేదే.
బాలా నగర్‌లో ఉండే విమల్ థియేటర్‌కు ఇంతకుముందు అంత గుర్తింపేమీ లేదు. కానీ ఈ థియేటర్‌ను మైత్రీ వాళ్లు తమ చేతుల్లోకి తీసుకుని రెనొవేట్ చేశారు.

భారీ స్క్రీన్, పెద్ద ఆడిటోరియం, లేటెస్ట్ టెక్నాలజీతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ది బెస్ట్ సింగిల్ స్క్రీన్లలో ఒకటిగా ఇది రూపుదిద్దుకుంది. ‘స్పిరిట్’ సినిమా కోసం ఈ థియేటర్‌ను ఉపయోగించడం ద్వారా దానికి మంచి ప్రమోషన్ కూడా వస్తుందని మైత్రీ భావిస్తోంది.