మోహన్ లాల్ ఇలా చేశాడేంటి?

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్లలో మోహన్ లాల్ ఒకడు. మలయాళ ఇండస్ట్రీలో ఆయనే నంబర్ వన్. ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే పాత రికార్డులు బద్దలు కావాల్సిందే. మాలీవుడ్‌లో తొలి రూ.50 కోట్లు, తొలి రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన సినిమాలు లాల్‌వే. ‘దృశ్యం’ సినిమాతో తొలి రూ.50 కోట్ల గ్రాస్ సినిమాను మలయాళ ఇండస్ట్రీకి అందించాడు మోహన్ లాల్. ఆ చిత్రం వివిధ భాషల్లో రీమేక్ అయి అన్ని చోట్లా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది. ఒరిజినల్ రూపొందించిన జీతు జోసెఫే దీనికీ దర్శకత్వం వహించాడు. మోహన్ లాల్ సరసన మీనానే నటించింది. ఈ సినిమాను లాక్ డౌన్ తర్వాత మొదలుపెట్టిన నెలన్నరకే పూర్తి చేసేసింది చిత్ర బృందం. త్వరలోనే విడుదలకు సినిమాను సిద్ధం చేస్తున్నారు. నూతన సంవత్సర కానుకగా టీజర్ కూడా రిలీజ్ చేశారు.

ఐతే టీజర్ కంటే కూడా ఈ సినిమాను ఎక్కడ రిలీజ్ చేస్తున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తారని అంతా అనుకోగా.. లాల్ టీం మాత్రం ఓటీటీని ఎంచుకుంది. అమేజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రానికి త్వరలోనే ప్రిమియర్స్ పడుతున్నాయి. అక్కడ ప్రిమియర్స్ అయిన తర్వాత కొన్నాళ్లకు థియేటర్లకు వస్తుందో ఏమో తెలియదు కానీ.. ముందు మాత్రం థియేట్రికల్ రిలీజ్ లేదు.

ఐతే వివిధ ఇండస్ట్రీల్లో మీడియం రేంజి సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కోసమే నెలల తరబడి ఎదురు చూశాయి. ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చినా తిరస్కరించాయి. పెద్ద హీరోల సినిమాల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. అలాంటిది మోహన్ లాల్ లాంటి పెద్ద స్టార్.. కోవిడ్ తర్వాత పూర్తయిన తొలి సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి మళ్లీ ప్రేక్షకులను థియేటర్ల వైపు మళ్లిస్తారని అనుకున్నారు. ఇండస్ట్రీకి ఈ చిత్రంతోనే ఒక ఊపు వస్తుందని ఆశించారు.

తమిళంలో విజయ్ సినిమా ‘మాస్టర్’ ఇలాగే కోలీవుడ్ రీస్టార్ట్‌కు ఉపయోగపడుతోంది. కానీ లాల్ మాత్రం థియేటర్లు తెరుచుకున్నాక ఓటీటీ బాట పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐతే ఈ సినిమా మొదలవడానికి ముందే అమేజాన్‌తో ఒప్పందం కుదిరిందని.. వాళ్లిచ్చిన అడ్వాన్స్‌తోనే సినిమాను పూర్తి చేశారని.. ఈ ఒప్పందం జరిగే సమయానికి థియేటర్ల భవితవ్యంపై స్పష్టత లేని నేపథ్యంలో ఆ డీల్ కానిచ్చేశారని.. దీంతో అనివార్యంగా ప్రైమ్‌లోనే సినిమాను రిలీజ్ చేయాల్సి వస్తోందని చిత్ర వర్గాలు అంటున్నాయి.