యాత్ర డైరెక్టర్ మళ్లీ వస్తున్నాడు

పాఠశాల అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు మహి.వి.రాఘవ్. కొత్త వాళ్లు నటించిన ఈ రోడ్ ట్రిప్ మూవీకి మంచి రివ్యూలు వచ్చినా కమర్షియల్ సక్సెస్ కాలేదు. ఐతే తర్వాత హార్రర్ కామెడీ జానర్లో సరికొత్త కథతో రూపొందించిన ‘ఆనందో బ్రహ్మ’తో మహి తొలి విజయాన్నందుకున్నాడు. ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా అతనొక పొలిటికల్ బయోపిక్ తీశాడు. అదే.. యాత్ర.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. వైఎస్ అంటే నచ్చని వాళ్లు కూడా ఈ సినిమా తీసిన విధానాన్ని మెచ్చుకున్నారు. ఆపై మహి అడుగులు డిజిటల్ ఎరేనా వైపు పడ్డాయి. తను క్రియేటర్‌గా ‘సేవ్ ద టైగర్స్’ తీశాడు. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన సీజన్-2 సైతం ఆకట్టుకుంది. కానీ మధ్యలో మహి దర్శకుడిగా దెబ్బ తిన్నాడు.

వైఎస్ జగన్ మీద తీసిన ‘యాత్ర-2’ తుస్సుమంది. జగన్‌కు లేని గొప్పదనాన్ని ఆపాదించి ఈ సినిమా తీయడం.. మరోవైపు ఈ సినిమా తీసినందుకు జగన్ ప్రభుత్వం ద్వారా ఆయాచిత లబ్ధి పొందాలని చూడడంతో మహిపై విమర్శలు తప్పలేదు. ఈ ఫెయిల్యూర్, మీడియాలో వచ్చిన వ్యతిరేక వార్తలతో అన్‌పాపురల్ అయిన మహి.. రెండేళ్లుగా అడ్రస్ లేడు.

ఐతే మహి ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అయ్యాడు. తన సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ మూడో సీజన్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు మహి. విశేషం ఏంటంటే.. తొలి రెండు సీజన్లలో ప్రేక్షకులను ఎంతో నవ్వించిన ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్యలకు ఈసారి వెన్నెల కిషోర్ తోడవుతున్నాడు.

దీంతో ఫన్ డబులవుతుందని భావిస్తున్నారు. ఈసారి కథలో కొత్త మలుపులు కూడా ఉంటాయని అంటున్నారు. హాట్ స్టార్ వేదికగా త్వరలోనే ‘సేవ్ ద టైగర్స్’ మూడో సీజన్ ప్రసారం కాబోతోంది. మరి ఈ కామెడీ వెబ్ సిరీస్‌తో మళ్లీ సక్సెస్ అందుకుని, ఆ తర్వాత దర్శకుడిగా కొత్త సినిమాను మహి మొదలుపెడతాడేమో చూడాలి.