ఇరుకున పడకుండా ‘ఇరుముడి’ జాగ్రత్తలు

మాస్ మహారాజా రవితేజకు ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ పడాలి. కమర్షియల్ ఫార్మట్ లో మాస్ జాతర చేసినా, ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసుకుని భర్త మహాశయులకు విజ్ఞప్తి ఇచ్చినా ఫలితం మారడం లేదు. ఒకప్పటి కిక్, క్రాక్, విక్రమార్కుడు తరహా అదిరిపోయే సినిమా కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఓపెనింగ్స్, క్రౌడ్ పుల్లింగ్ లో ఇప్పటికీ రవితేజకు స్ట్రాంగ్ బేస్ ఉంది. కానీ దాన్ని వాడుకునే దర్శకులు పడకపోవడం వల్ల ఇంత కాలం సక్సెస్ అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తోంది.

ఈసారి గురి గట్టిగానే పెట్టుకున్నారు రవితేజ. ఇరుముడి మీద ముందు నుంచే పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. దర్శకుడు శివ నిర్వాణ బ్రాండ్ ఇమేజ్ కన్నా కంటెంట్ లోని బలమే ప్రమోషన్స్ ని నిలబెడుతోంది. ఇప్పటిదాకా విడుదల తేదీ ఖరారు చేసుకోని ఇరుముడి తాజాగా ఆగస్ట్ రిలీజ్ మీద కన్నేసినట్టు లేటెస్ట్ అప్డేట్. ఆగస్ట్ చివరి రెండు వారాలు నాని ది ప్యారడైజ్, శర్వానంద్ భోగితో పాటు దుల్కర్ సల్మాన్ ఐ యాం గేమ్ తో లాకైపోయాయి.

అందుకే దానికన్నా ముందు ఆగస్ట్ మొదటి లేదా రెండో వారం ఇరుముడి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. రజనీకాంత్ జైలర్ 2 వచ్చే అవకాశం దాదాపు లేనట్టే. వినాయక చవితి పండక్కు షిఫ్ట్ అయిపోయిందని చెన్నై మీడియా కోడై కూస్తోంది. విశ్వంభర అంటున్నారు కానీ ఇంకా విఎఫ్ఎక్స్ వ్యవహారం తేలలేదు. దీనికన్నా ఆలస్యంగా మొదలైన మన శంకరవరప్రసాద్ గారు రిలీజైపోగా మెగా 158 మొదటి షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమయ్యింది. అయినా విశ్వంభర నుంచి నో అప్డేట్.

సో ఇరుముడికి ఎలాంటి ఇరకాటం లేకుండా సేఫ్ డేట్ దొరికినట్టు అవుతుంది. అయ్యప్ప స్వామి మాల సెంటిమెంట్ తో పాటు పాప ఎమోషన్ ప్రధానంగా అల్లిన ఈ కథలో కమర్షియల్ అంశాలకు కొదవ లేకుండా శివ నిర్వాణ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారట. టక్ జగదీష్ లో చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా ఈసారి పర్ఫెక్ట్ మాస్ ఎంటర్ టైనర్ ఇస్తాననే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్న ఇరుముడికి తమిళనాడు, కేరళ బిజినెస్ వర్గాల్లో కూడా క్రేజ్ ఉంది.