కొత్త సినిమాలను విడుదల ముంగిట ఫైనాన్స్ వివాదాలు చుట్టుముట్టడం.. రిలీజ్ విషయంలో ఇబ్బందులు తలెత్తడం కొత్తేమీ కాదు. దశాబ్దాల నుంచి ఈ ఒరవడి చూస్తూనే ఉన్నాం. గత ఏడాది తెలుగులో నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ అనూహ్యంగా ఇలాంటి చిక్కుల్లోనే పడింది. రిలీజ్ ముందు రోజు వరకు ఈ సినిమాకు ఇబ్బందులు ఉన్నట్లే వెల్లడి కాలేదు. సరిగా రిలీజ్ విడుదలకు ముందు రోజు 14 రీల్స్ ప్లస్ అధినేతల పాత సినిమాలకు సంబంధించిన ఫైనాన్స్ గొడవల వల్ల రిలీజ్ ఆగిపోయింది.
ముందుగా విడుదలకు ముందు రోజు రాత్రి పడాల్సిన ప్రిమియర్స్ ఆగిపోయాయి. తర్వాతి రోజు కూడా సినిమా రిలీజ్ కాలేదు. చివరికి ఇంకో వారం తర్వాత అతి కష్టం మీద ‘అఖండ-2’ను విడుదల చేశారు. కానీ ఆలస్యం వల్ల ఆదాయంలో కోత పడింది. దీనికి తోడు సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో ఆశించిన వసూళ్లు రాలేదు.
‘అఖండ-2’తో నిర్మాతలు పాత నష్టాలన్నీ పూడ్చుకుంటారని భావిస్తే అలాంటిదేమీ జరగలేదు. ఈ సినిమా వల్ల కొత్త నష్టాలే మిగిలాయి. దీంతో రిలీజ్ తర్వాత ఆ నిర్మాతలు అడ్రస్ లేకుండా పోయారు. వారి తర్వాతి సినిమా ‘టైసన్ నాయుడు’ పరిస్థితి ఏంటో తెలియట్లేదు.
ఐతే ఇటీవల ‘అఖండ-2’ లాంటి పరిస్థితినే సూర్య సినిమా ‘కరుప్పు’ కూడా ఎదుర్కొంది. అచ్చంగా 14 రీల్స్ ప్లస్ అధినేతల తరహాలోనే డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థను నడిపించే ఎస్.ఆర్.ప్రభును గత సినిమాల ఫైనాన్స్ వివాదాలు సుడిగుండంలో పడేశాయి. దీంతో 14న సినిమా రిలీజ్ కాలేదు.
ఐతే సూర్య ముందుకొచ్చి హామీగా నిలబడడం, ఇండస్ట్రీలో మరికొందరి సహకారంతో తర్వాతి రోజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ కావడం నిర్మాతకు ఎంతో అవసరమైన స్థితిలో ‘కరుప్పు’ అంత గొప్ప టాకేమీ రాలేదు. కానీ సమ్మర్లో సరైన సినిమాలు లేని టైంలో రిలీజ్ టైమింగ్ కలిసొచ్చింది. సానుభూతి కూడా పని చేసింది. సూర్య ఫ్యాన్స్, మాస్ ప్రేక్షకులు ఈ చిత్రంతో సంతృప్తి చెందారు.
దీంతో ‘కరుప్పు’ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. తెలుగులో కూడా వసూళ్లు పర్వాలేదు. మధ్యలో సూర్య తమ్ముడి సినిమా ‘వా వాతియార్’ సైతం ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొంది కానీ.. కొన్ని వారాలు లేటుగా రిలీజైన ఆ సినిమా డిజాస్టర్ అయింది.
‘అఖండ-2’ నిర్మాతల్లాగే ‘వా వాతియార్’ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాకు కూడా కోలుకోలేని దెబ్బ తగిలి, ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయ్యే పరిస్థితి వచ్చింది. ‘కరుప్పు’ ఆడకపోతే ప్రభు పరిస్థితి అలాగే అయ్యుండేది. కానీ ఈ సినిమా అతణ్ని నిలబెట్టేలాగే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates