దర్శకుడిగా రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి టాప్ హీరోతో సినిమా చేసే అవకాశం లభించడం అంటే చిన్న విషయం కాదు. బుచ్చిబాబు సానా ఈ అరుదైన అవకాశాన్నే అందుకున్నాడు. కొత్త హీరో హీరోయిన్లతో అను రూపొందించిన ‘ఉప్పెన’కు బాక్సాఫీస్ టైమింగ్ భలేగా కలిసొచ్చి అది ఏకంగా వంద కోట్ల సినిమాగా నిలిచింది.
బుచ్చిబాబుకు దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చి పెట్టింది. ఆ వెంటనే అతడికి అవకాశాలకు లోటు లేకపోయినా.. ఒక పెద్ద హీరోతోనే రెండో సినిమా చేయాలని పట్టుబట్టి కూర్చున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్‌తో అనుకున్న సినిమా ముందుకు కదలేకపోయినా.. ఓపిగ్గా ఎదురు చూసి రామ్ చరణ్‌తో సినిమాను పట్టాలెక్కించాడు. ఆ చిత్రమే.. పెద్ది.
ఈ సినిమా మొదలైనపుడు మరీ అంచనాలేమీ లేవు. ఒక చిన్న సినిమా తీసిన అనుభవంతో బుచ్చిబాబు ఒక పెద్ద హీరోను ఏమాత్రం డీల్ చేస్తాడో అనే సందేహాలుండేవి. దీనికి తోడు రామ్ చరణ్ చివరి రెండు చిత్రాలు ఆచార్య, గేమ్ చేంజర్ డిజాస్టర్లు కావడం ఈ చిత్రానికి మైనస్ అయింది. కానీ ‘పెద్ది’ రిలీజ్ దగ్గర పడేసరికి అంతా మారిపోయింది. ఈ సినిమా ప్రోమోలన్నీ భలేగా క్లిక్ అయ్యాయి. దీనికి తోడు బాక్సాఫీస్ పరిస్థితులు కూడా ఈ చిత్రానికి భలేగా కలిసొచ్చాయి.
ఫస్ట్ గ్లింప్స్‌లో చరణ్ సిగ్నేచర్ బ్యాటింగ్ మూమెంట్, చికిరి పాట సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ చేసి పెట్టాయి. దీనికి తోడు సంక్రాంతి తర్వాత సరైన సినిమా పడకపోవడమూ ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకులు మొత్తంగా ‘పెద్ది’ మీదే ఆశలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది.
ఇండస్ట్రీ జనాలతో పాటు ప్రేక్షకులు అందరూ ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు గత కొన్ని రోజులుగా. వచ్చే నెల జూన్ 3 రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో మెజారిటీ ‘పెద్ది’ సినిమానే ప్రదర్శించబోతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి హైప్ ఉంది.
విడుదలకు ముందు ఈ రకమైన బజ్ తెలుగులో బాహుబలి, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, పుష్ప-2 చిత్రాలకు మాతర్మే వచ్చింది. బుచ్చిబాబు రెండో సినిమాకే తన గురువు సుకుమార్‌ను మ్యాచ్ చేసేశాడు. రామ్ చరణ్‌తో సుకుమార్ తీసిన ‘రంగస్థలం’కు కూడా ఈ స్థాయి హైప్ లేదు.
అలాంటిది చరణ్‌తో తాను తీసిన సినిమాతో ఇంకా ఎక్కువ హైప్ క్రియేట్ చేయగలిగాడు బుచ్చిబాబు. ఇదొక రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. మరి సినిమా అంచనాలకు తగ్గట్లే ఉంటే.. బుచ్చిబాబు టాలీవుడ్ నుంచి రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాక.. పాన్ ఇండియా స్థాయిలోనూ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates