ఐబొమ్మ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. కొన్నేళ్ల నుంచి తెలుగు చిత్రాలతో పాటు తెలుగులో రిలీజయ్యే వేరే భాషా చిత్రాలను కూడా పైరసీ చేసి క్వాలిటీ ప్రింట్లు అందిస్తూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న వెబ్ సైట్. ముందుగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చే సినిమాలను మాత్రమే పైరసీ చేసి అందిస్తూ వచ్చిన ఈ వెబ్ సైట్.. తర్వాత థియేటర్లలో రిలీజైన సినిమాల హెచ్‌డీ ప్రింట్లను కూడా అందుబాటులోకి తేవడం మొదలుపెట్టింది.
ఇలా తెలుగు ప్రేక్షకుల్లో ఒక వర్గాన్ని బాగా పైరసీకి అలవాటు పడేలా చేసి భారీగా ఫాలోయింగ్, ఆదాయం తెచ్చుకుంది ఈ వెబ్ సైట్. దీన్ని నడిపేది రవి అనే వ్యక్తి అని కొన్ని నెలల కిందటే వెల్లడైంది. ఒక చిన్న క్లూను పట్టుకుని ఈ కుర్రాడిని పోలీసులు పట్టేసుకున్నారు.
కరీబియన్ దీవులు సహా పలు దేశాల నుంచి సైట్‌ను ఆపరేట్ చేస్తున్న అతను.. తన విడాకుల కేసు కోసం హైదరాబాద్‌కు వస్తే, ఆ సమాచారం అందుకుని అతణ్ని అరెస్ట్ చేశారు. తన మీద పలు కేసులు పెట్టి కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపేలా చేశాడు. ఈ మధ్యే రవి బెయిల్ మీద బయటికి వచ్చాడు.
రవి బయటికొచ్చిన కొన్ని వారాలకే ఐబొమ్మ సైట్ మళ్లీ యాక్టివేట్ అయింది. అందులో పైరసీ సినిమాలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఇన్ని కేసులు పెట్టినా, జైలు జీవితం అనుభవించినా రవికి బుద్ధి రాలేదనే కామెంట్లు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. కానీ కొత్తగా మొదలైన ఐబొమ్మ సైట్‌తో తనకు సంబంధం లేదని అంటున్నాడు రవి.
కొత్తగా మొదలైన ఐబొమ్మ, బప్పం టీవీ సైట్లపై మరోసారి ఫిలిం ఛాంబర్ నుంచి ఫిర్యాదు అందగా.. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. కానీ ఈ సైట్లతో తనకు సంబంధం లేదని పోలీసులకు రవి స్పష్టం చేశాడు.
అతడు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఇంకెవరో కొత్తగా ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్లను నడుపుతున్నారని.. కొత్త సినిమాల పైరసీ వెర్షన్లు ఇంటర్నెట్లో పెడుతున్నారని పోలీసులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇంతగా అన్‌పాపులర్ అయ్యాక, కేసులు ఎదుర్కొన్నాక, అందరి దృష్టి తన మీద ఉన్న సమయంలో రవి ఇలా మళ్లీ ఇలా చేస్తాడని అనుకోలేం. కాబట్టి ఇంకెవరో రంగంలోకి దిగారని అర్థమవుతోంది. మరి ఈ సైట్లను పోలీసులు ఎలా కట్టడి చేస్తారన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates