21 ఇండస్ట్రీ ప్రతినిధులు… తీరిపోవాలి సమస్యలు

ఇండస్ట్రీని గత నాలుగైదు రోజులుగా కుదిపేస్తున్న సింగల్ స్క్రీన్ పర్సెంటెజ్ వివాదం ఎట్టకేలకు పరిష్కారం దిశగా అడుగులు వేయడం మూవీ లవర్స్ లో సంతోషాన్ని నింపుతోంది. ముఖ్యంగా పెద్దికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని మండలి తరఫున దిల్ రాజు హామీ ఇచ్చేయడంతో మెగా ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు. లేకపోతే హైదరాబాద్ లో సరైన షోలు పడక తీవ్ర నష్టంతో పాటు అభిమానులు బాగా హర్టయ్యేవాళ్ళు. ఏదైతేనేం ప్రస్తుతానికి టెన్షన్ అక్కర్లేదు.

వీలైనంత త్వరగా ఈ పర్సెంటేజ్ వివాదం కొలిక్కి తెచ్చెదుకు ఫిలిం ఛాంబర్ మొత్తం 21 సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది. నిర్మాతల వైపు నుంచి సురేందర్ రెడ్డి, సుప్రియ, రవిశంకర్, బాపినీడు, చెరుకూరి సుధాకర్, ఎస్కెఎన్, ప్రసన్న కుమార్ ఇందులో ఉంటారు. ఎగ్జిబిటర్ల తరఫున ప్రతాప్ రెడ్డి, బాల్ గోవింద్ రాజ్, అనుపమ్ రెడ్డి, శ్రీనివాసరావు, వీర నారాయణబాబు, వంశీ కిషోర్, విజందర్ రెడ్డి భాగం వహిస్తారు.

ఇక డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి విష్ణు మూర్తి, వీర్ నాయుడు, సుధాకర్ రెడ్డి, ముత్యాల రాందాస్, నాగార్జున ఎన్, మధుసూదన్ రెడ్డి, ధీరజ్ మొగిలినేని ప్రాతినిధ్యం తీసుకున్నారు. మొత్తం 21 సభ్యులు ఉన్న ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ని బట్టి ఈ గ్రూపులకు మార్గదర్శకత్వం వహిస్తున్న సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, కెఎల్ నారాయణ, అశోక్ కుమార్ అందరితో కలిసి చర్చించి అభిప్రాయాలు తీసుకుని చివరి నిర్ణయాలు వెల్లడిస్తారు.

దీనికి నెల నుంచి రెండు నెలల దాకా గడువు పెట్టుకుని దానికి అనుగుణంగానే చర్చలు జరపబోతున్నట్టు తెలిసింది. సర్వసభ్య సమావేశంలో చిన్నపాటి గొడవలు రేగినా ఇకపై అలాంటి వాటికి తావు ఇవ్వకుండా పైన చెప్పిన మెంబర్స్ కలిసికట్టుగా కృషి చేయబోతున్నారు. అప్పటిదాకా రిలీజయ్యే సినిమాలు పర్సెంటేజ్ స్లాబ్ లోకి రావు. జూన్ 4 పెద్ది విడుదలయ్యాక వరసగా మా ఇంటి బంగారం, సింగ్ గీతం, లెనిన్ లాంటి వరస రిలీజులు సందడి చేయబోతున్నాయి.