రిలీజ్ ఆగింది… కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడు

ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమా తీసి చెప్పిన సమయానికి రిలీజ్ చేయడం అన్నది అంత తేలికైన విషయం కాదు. ఐతే కథ రాయడం దగ్గర్నుంచి మొదలుపెడితే.. సినిమా పూర్తయ్యే వరకు కొన్నేళ్ల పాటు ఎంతో కష్టం ఉంటుంది. అంత కష్టపడి తీసిన సినిమాను విడుదల చేయడంలో చాలా ఆలస్యం జరిగి ఎట్టకేలకు థియేటర్లో బొమ్మ పడే సమయం వస్తే.. అనూహ్యంగా రిలీజ్ ఆగిపోతే చిత్ర బృందం పడే వేదన అంతా ఇంతా కాదు.

ముఖ్యంగా దర్శకు నిర్మాతల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఇప్పుడు సూర్య చిత్రం ‘కరుప్పు’ మేకర్స్ ఈ బాధనే అనుభవిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి ఈ సినిమాకు యుఎస్ ప్రిమియర్స్ పడాల్సింది. ఇండియాలో ఉదయం 9 గంటల నుంచే షోలు మొదలు కావాల్సింది. కానీ నిర్మాతకు ఉన్న ఏవో ఆర్థిక వివాదాల కారణంగా అనూహ్యంగా ‘కరుప్పు’ రిలీజ్ ఆగిపోయింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘వీరభద్రుడు’కు కూడా షోలు పడలేదు.

నిర్మాత ఎస్.ఆర్.ప్రభు నిన్న అర్ధరాత్రి దాటాక ఒక చిన్న ట్వీట్ పెట్టి, ఫైనాన్స్ ఇష్యూను పరిష్కరించే పనిలో పడ్డాడు. హీరో సూర్య కూడా తన ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు ఆర్జే బాలాజీ అభిమానులకు రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

సమస్య పరిష్కారం కోసం అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయని.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అన్నీ ఒక కొలిక్కి వచ్చి షోలు మొదలవుతాయని ఆశిస్తున్నట్లు అతను చెప్పాడు. సినిమా చూసేదే బాధలు మరిచిపోయి కొంత ఆనందం పొందాలని.. కానీ సినిమా చూడ్డమే ఒక వేదన అయితే ప్రేక్షకుల పరిస్థితి ఏంటో తాను అర్థం చేసుకోగలనంటూ.. ఈ మూవీ చూసేందుకు థియేటర్లకు వచ్చి వెనుదిరిగిన ప్రేక్షకులకు అతను క్షమాపణలు చెప్పాడు.

ఈ మాటలు చెబుతూ అతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేశాడు. ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఆగడం లేదని అతను అన్న మాటలు అందరినీ కదిలించేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి అతను ఎంతగా ఏడ్చాడో ఎర్రబడ్డ కళ్లు, కందిపోయిన ముఖం చూస్తేనే అర్థమైపోతోంది. తన బాధ చూశాక ఎలా అయినా ఈ రోజు సాయంత్రానికి షోలు పడితే బాగుండని అందరూ కోరుకుంటున్నారు.