తమిళ సినీ రాజకీయ వర్గాలతో పాటు తెలుగు విజయ్ అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఎవరయ్యా అంటే ఠక్కున త్రిష పేరే గుర్తొస్తుంది. కొత్త ముఖ్యమంత్రికి త్వరలో కాబోయే భార్యగా తన మీద జరుగుతున్న ప్రచారానికి బలం ఇచ్చేలా ఫలితాల రోజు ఆయన ఇంటికి వెళ్ళడం, ప్రమాణ స్వీకారోత్సవంలో ఆకర్షణగా నిలవడం జనంలో చర్చకు దారి తీశాయి. విజయ్ విడాకుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకుండానే త్రిష గురించి ఇంత డిస్కషన్ జరగడం అనూహ్యం.
సరే ఇది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం అనుకుంటే సినిమాల పరంగా త్రిషని ఒక నెగటివ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. గత రెండేళ్లుగా తనకు చేతి నిండా సినిమాలున్నాయి. కాకపోతే అవి అయితే డిజాస్టర్ కావడం లేదా పదే పదే వాయిదాలు పడి రిలీజ్ ఆలస్యమై జనంలో ఆసక్తి తగ్గిస్తున్నాయి. మే 14 విడుదల కానున్న సూర్య ‘వీరభద్రుడు’లో హీరోయిన్ త్రిషనే. విచిత్రం ఏమిటంటే సామాన్య ప్రేక్షకులకు ఈ విషయం కనీసం తెలియకపోవడం. ప్రమోషన్స్ అంత వీక్ గా ఉన్నాయి.
చిరంజీవిలో ‘విశ్వంభర’లో నటించి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ విడుదల తేదీ తేలడం లేదు. అదిగో ఇదిగో అంటున్నారు తప్పించి ఏడాదిగా కాలయాపన చేస్తూనే ఉన్నారు. మోహన్ లాల్ ‘రామ్’ కూడా ఇదే సమస్యతో బాధ పడుతోంది. వీటికన్నా ముందు కమల్ హాసన్ తో చేసిన ‘తగ్ లైఫ్’ ఘోరంగా పోయింది. అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తమిళంలో మాత్రమే గట్టెక్కింది. ‘విడాముయార్చి’ ఏమయ్యిందో తెలిసిందే. మలయాళం ‘ఐడెంటిటీ’ కూడా డిజాస్టరే.
ట్రాక్ రికార్డు ఇంత బ్యాడ్ గా మారిపోయిన నేపథ్యంలో త్రిష వెంటనే కంబ్యాక్ అవ్వడానికి ఉన్న అవకాశం వీరభద్రుడే. సూర్య డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీలో తనకు ఎంత ప్రాధాన్యం దక్కిందనేది అనుమానమే. ఎప్ప్పుడో ఆరులో సూర్యతో తన జంటని చూసిన ప్రేక్షకులు మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఈ కలయికకు చూడబోతున్నారు. త్రిష ఇకపై కొత్త సినిమాలు ఒప్పుకోవడం డౌటేనని కోలీవుడ్ మీడియా టాక్. అదే నిజమైతే కొత్త రాజకీయ ప్రయాణం మొదలుపెడుతుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates