సరదాగా చెప్పానంటున్న మల్లారెడ్డి కోడలు

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ప్రీతి రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సినిమా విడుదల రోజున కాలేజీకి సెలవు ఇవ్వనున్నట్లు ఆమె ప్రకటించడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. విద్యా సంస్థల్ని కమర్శియల్ సినిమాలకు పబ్లిసిటీ ప్లాట్ ఫార్మ్స్ గా మారుస్తున్నారని మేధావులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ప్రీతి రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు..అసలేం జరిగిందంటే…

ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీన హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో ఆదర్శ కుటుంబం సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. ఈ వేడుకల్లో హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ ఛైర్‌పర్సన్ ప్రీతి రెడ్డి వేదికపై వెంకటేష్‌తో కలిసి డ్యాన్స్  చేశారు. ఆ ఉత్సాహంలో ఆమె సినిమా విడుదల రోజున విద్యార్థులకు కాలేజీ సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు.. దీన్ని అనేకమంది సోషల్ మీడియాలో  ట్రోల్ చేశారు. 

ఒక కమర్షియల్ సినిమా ప్రమోషన్ కోసం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం పట్ల ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ తదితర విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

విద్యాసంస్థలను పబ్లిసిటీ కేంద్రాలుగా మారుస్తున్నారని నెటిజన్ల నుంచి విపరీతంగా విమర్శలు వచ్చాయి. దీనివల్ల విద్యార్థుల చదువు దెబ్బతింటుందని తల్లిదండ్రులు సైతం అభ్యంతరం  వ్యక్తం చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నత విద్యామండలికి కూడా ఫిర్యాదు చేశారు. దాంతో కాలేజీ యాజమాన్యానికి ఇది తలనొప్పిగా మారింది.  తాను ఒకటి తలిస్తే మరొకటియ్యిందని భావించిన ప్రీతి రెడ్డి మీడియా ముందుకు వచ్చారు.

నేను సరదాగా విద్యార్థులకు సెలవు ప్రకటించాను, అంతే తప్ప అధికారికంగా ఎలాంటి సర్క్యులర్  జారీ చేయలేదని ఆమె స్పష్టం చేశారు.  తమ కాలేజీలో ఏడాది పొడవునా విద్యార్థులు చదువుతుంటారని, పరిశోధనలు చేస్తుంటారని తెలిపారు. అందుకే కాలేజీకి పెద్ద సంఖ్యలో అడ్మిషన్స్ జరుగుతున్నాయని వివరించారు. అయినా  తమ కాలేజీ విద్యార్థులు రెండు మూడు రోజులు సినిమా ఈవెంట్ వల్ల ఆనందంగా గడిపితే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. వైస్ చైర్మన్ వివరణ తర్వాతైనా వివాదం సద్దుమణుగుతుందని ఆశిద్దాం.