పాదయాత్ర ఒకటే సరిపోదు జగన్

వైసీపీ నేత‌ల నోటి నుంచి వినిపిస్తున్న ఏకైక మాట పాద‌యాత్ర‌. వ‌చ్చే ఏడాదిలో జ‌గ‌న్ 2.0 పేరుతో పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నార‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. త‌ద్వారా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల‌న్న‌ది ఆయ‌న ఆకాంక్ష‌. ఇదే విష‌యం ఇప్పుడు ఆ పార్టీ నాయ‌కులలో ఆశ‌లు రేకిత్తిస్తోంది. కానీ.. ఇది ఒక్క‌టే ప్ర‌స్తుతం వైసీపీకి తార‌క‌మంత్ర‌మా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఎందుకంటే.. మారుతున్న ప‌రిణామాలు.. రాష్ట్రంలో పెరుగుతున్న రాజ‌కీయ ఒత్తిడి వంటివి వైసీపీకి పెను ప్ర‌మాదంగా మారుతున్నాయ‌ని కొంద‌రు చెబుతున్నారు.

రెడ్డి సామాజిక వ‌ర్గంలోనే చీలిక వ‌చ్చి.. వైసీపీపై ప్ర‌భావం చూపిస్తున్న ద‌రిమిలా.. వైసీపీ త‌న ఆలోచ‌న‌ల‌ను మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉందని అంటున్నారు. ఇదేస‌మ‌యంలో స్థానిక‌, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ తీవ్రంగా దెబ్బ‌తింది. ఒక‌ప్ప‌టి ప్ర‌భావం ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. అంతేకాదు.. గ‌త విజ‌యాల‌తో పోల్చి చూస్తే.. ప్ర‌స్తుతం సాధించింది… 1-2 శాతం మేర‌కు మాత్ర‌మేన‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. ఇదే విష‌యంపై జ‌గ‌న్ కూడా అంచ‌నాలు వేసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఒక్క పాద‌యాత్ర‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటే.. జ‌గ‌న్‌కు ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా తొలిసారి పాద‌యాత్ర చేసిన‌ప్పుడు కూడా.. 151 స్థానాలు వ‌చ్చినా.. మిగిలిన 24 స్థానాలు ఎందుకు పోయాయ‌న్న‌ది జ‌గ‌న్ ఆలోచ‌న చేయ‌లేక‌పోయారు. అప్ప‌టి ప్ర‌భావం ఇప్పుడు ఉంటుందా? అనేది కూడా సందేహంగానే మారింది. మ‌రోవైపు.. రాజ‌కీయంగా ఇప్పుడు పోటీ పెరిగింది. ఒక‌వైపు సోద‌రి ష‌ర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కి వెన్ను-ద‌న్ను అన్నీ జ‌గ‌నే!. జ‌గ‌న్‌ను దెబ్బ‌తీయ‌కుండా కాంగ్రెస్ ఎదిగే ప‌రిస్థితి లేదు.

ఇక‌, వైసీపీ నుంచి వ‌చ్చిన సాయిరెడ్డి తాజాగా ప‌రివ‌ర్త‌న రాజ‌నీతి పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి కూడా.. జ‌వ‌జీవాలు.. వైసీపీ నుంచే అందుతాయ‌ని ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నారు. బ‌హిరంగ వేదిక‌పైనే వైసీపీ నుంచివ‌చ్చే నాయకుల‌కు రెడ్ కార్పెట్ ప‌రుస్తామ‌ని చెప్పారు. ఆయ‌న పార్టీ అధికారంలోకి రాక‌పోవ‌చ్చు.. ఒక్క నాయ‌కుడు కూడా గెలిచే ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చు.. అని జ‌గ‌న్ అంచ‌నా వేయవ‌చ్చు. కానీ, దీనికి ముందు.. వైసీపీలో పుట్టే సెగ‌లు.. పెరిగే డిమాండ్లు.. నాయ‌కుల వైరుద్యం.. వంటివాటిని అంచ‌నా వేయ‌లేకపోతే.. పార్టీని వ‌ర్గాల వారీగా వ‌చ్చే న‌ష్టాన్ని పాద‌యాత్ర భ‌ర్తీచేయ‌లేద‌న్న వాద‌న ఉండ‌డం గ‌మ‌నార్హం. సో.. హోం వ‌ర్క్ అత్యంత ముఖ్య‌మని అంటున్నారు విశ్లేష‌కులు.