అటెన్షన్ మొత్తం మెగావర్స్ తీసుకుంటే

మెగా అభిమానులకు కొత్త టెన్షన్ మొదలయ్యింది. ఒకపక్క కాకా షూటింగ్ శరవేగంగా జరుగుతూ జనవరి 13 విడుదలని పదే పదే నొక్కి చెబుతోంది. ఇంకోవైపు విశ్వంభర డబ్బింగ్ పనులు ఊపందుకున్నాయి. ఇది కూడా పండక్కు వస్తుందనే తరహాలో టీమ్ ఇన్ డైరెక్ట్ గా సంకేతాలిస్తోంది. అసలు చిరంజీవి మనసులో ఏముందో ఎవరికి అంతు చిక్కడం లేదు. ఈ రెండు తక్కువ గ్యాప్ లో రాకూడదని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆందోళన చెందాల్సిన పాయింట్ ఇది కాదు.

చిరంజీవి నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్న కొత్త టాక్ షో డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ప్రతి శుక్రవారం రాత్రి ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారు. మొదటిది నాగార్జున ఫ్యామిలీతో చేసిన సంగతి తెలిసిందే. తర్వాత కమల్ హాసన్, బ్రహ్మానందం బ్యాచ్ ఇలా వరసగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు. ప్రభాస్-సందీప్ వంగ ఎపిసోడ్ వచ్చే వారం నవంబర్ 20 షూట్ చేయొచ్చని అంటున్నారు. ఇంకా ఫైనల్ కాలేదు. మరికొందరు టాప్ సెలబ్రిటీల డేట్లను బట్టి త్వరలోనే చిత్రీకరణ చేస్తారు.

ఈ షో మీద నెట్ ఫ్లిక్స్ భారీగా ఖర్చు పెడుతోంది. ఇప్పటిదాకా ఓటిటిలో ఏ యాంకర్ కు ఇవ్వనంత భారీ రెమ్యునరేషన్ చిరంజీవికి ఆఫర్ చేశారని ఇండస్ట్రీ జనాల గుసగుస. ఎంతనేది బయటికి రాలేదు కానీ ఒక్కో ఎపిసోడ్ కి డబుల్ డిజిట్ సొమ్ము కోట్లలో అందుతోందని వినికిడి. సో ప్రమోషన్లు కూడా ఆ స్థాయిలోనే చేయాలి. ప్రోమోలు, ట్రైలర్లు చాలా బాగా కట్ చేశారని, చూశాక అంచనాలు అమాంతం పెరిగి షో చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తాయని యూనిట్ నుంచి వచ్చిన టాక్.

ఇలా డిసెంబర్ లో అటెన్షన్ కనక మెగావర్స్ మీదకు వెళ్తే కాకాకు టైం సరిపోదనేది ఫ్యాన్స్ అభిప్రాయం. ఎందుకంటే సంక్రాంతి పెద్ద దూరంలో ఉండదు కాబట్టి కాకా ఎక్కువ సౌండ్ చేయాలనేది వాళ్ళ కోరిక. బిజినెస్ ఇప్పటికే పూర్తయ్యింది. విశ్వంభర వ్యవహారం తేలగానే పబ్లిసిటీ స్పీడ్ పెంచేందుకు దర్శకుడు బాబీ కొల్లి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో పాట షూట్ జరుగుతోంది. దీనికి మెగావర్స్ కి మధ్య గ్యాప్ లేకుండా చిరంజీవి వరసగా డేట్లు ఇస్తూనే వెళ్తున్నారు.