సీన్ నుంచి నేర్చుకోవాల్సింది స్క్రీన్‌ప్లేనే

పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి, సూపర్ సక్సెస్ నుంచి బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతున్న సీన్ వసూళ్లు చాలా స్టడీగా ఉన్నాయి. ఆశ్చర్యకరంగా తెలుగులోనూ కలెక్షన్లు చాలా బాగుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో సాయంత్రం నైట్ షోలకు టికెట్లు దొరకడం లేదు. వీకెండ్ వస్తే చాలు అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. రెండో వారంలో కూడా ఎలాంటి డ్రాప్ లేకుండా నిక్షేపంగా దూసుకుపోవడం ఖాయంగా చెబుతున్నారు.

సీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. అదే స్క్రీన్ ప్లే. సినిమా మొదలైన ముప్పావు గంట వరకు హీరో పాత్రకు సంబంధించిన కీలక ట్విస్టుని బయట పెట్టకుండా మేనేజ్ చేసిన తీరు దర్శకుడు జీతూ మాధవన్ ఇంటెలిజెన్స్ కు నిదర్శనం. అది రివీల్ అయ్యాక కూడా సెకండాఫ్ లో సూర్య, నస్లెన్, నజ్రియా మధ్య రాసుకున్న ఛేజ్ ఎపిసోడ్స్, క్యాట్ అండ్ మౌస్ గేమ్ థియేటర్స్ లో మంచి థ్రిల్ ఇస్తున్నాయి. అక్కడ వీళ్ళ ముగ్గురి నటన పోటాపోటీగా సాగింది.

హీరోకి చూపుకు సంబంధించిన లోపం పెట్టి మెప్పించడం అంత ఈజీ కాదు. రవితేజ రాజా ది గ్రేట్, కమల్ హాసన్ అమావాస్య చంద్రుడు లాంటి అతి కొద్ది మూవీస్ మాత్రమే ఈ పాయింట్ తో విజయం సాధించాయి. అయితే సీన్ కేసు వేరు. సైకో క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కి హీరో లోపాన్ని ముడిపెట్టి నడిపించిన విధానం చాలా మందికి షాక్ కలిగించింది. తక్కువ బడ్జెట్ తో విఎఫ్ఎక్స్ పెద్దగా వాడకుండా జీతూ చేసిన స్క్రీన్ ప్లే మాయాజాలం రాబోయే ఫిలిం మేకర్స్ కు ఒక రిఫరెన్స్ గా నిలిచిపోతుంది.

కమర్షియల్ గా రికార్డులు బద్దలు కొడుతుందా లేదానేది పక్కన పెడితే సీన్ ఖచ్చితంగా సూర్య ఫిల్మోగ్రఫీలో ఒక స్పెషల్ ఫిలింగా నిలిచిపోతుంది. దీనికి కొనసాగింపు ఉంటుందా అంటే జీతూ మాధవన్ ఇప్పుడప్పుడే ఆ ఆలోచన చేసే ఉద్దేశంలో లేనని అంటున్నారు. ఓపెన్ ఎండింగ్ పెట్టేసి సీక్వెల్ మీద అంచనాలు వచ్చేలా చేశారు కానీ ఇప్పుడప్పుడే సీన్ 2 సాధ్యమయ్యే సూచనలైతే లేవు. 2026 మూడు బ్లాక్ బస్టర్స్ జేబులో వేసుకున్న సూర్య తిరిగి మార్చిలో మరో కొత్త సినిమాతో వచ్చేలా ఉన్నాడు.