ఓజి నామస్మరణకు బ్రేక్ ఇస్తే బెటర్

ఈ మధ్య తమన్ తరచుగా తెస్తున్న ప్రస్తావన ఓజి 2. తాజాగా ఇంకో అడుగు ముందుకు వేసి ఓజి 3 కూడా వస్తుందని ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ అభిమానులను బాగా ఎగ్జైట్ చేయొచ్చనే ఉద్దేశంతో ఇలా చెప్పడం బాగానే ఉంది కానీ గ్రౌండ్ లెవెల్ లో ఫ్యాన్స్ దీన్ని అంత సీరియస్ గా తీసుకోవడం లేదనేది వాస్తవం. ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ ముందున్న సవాళ్లు, వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న చిక్కులు వగైరాలు తనను ఒత్తిడిలోకి నెడుతున్న వైనం గమనించవచ్చు.

కాసేపు ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఇంకో నెలన్నరలో ఈ ఏడాది అయిపోతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు కేవలం రెండున్నర సంవత్సరాల కంటే తక్కువ టైం ఉంటుంది. చివరి ఆరు నెలలు ప్రచారాలకు, ఇతర కార్యక్రమాలకు వదిలేయాలి. మిగిలిన రెండేళ్లలో పవన్ మహా అయితే ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంది. అది కూడా ఓజి 2నే. నాని బ్లడీ రోమియో పూర్తి చేసుకుని దర్శకుడు సుజిత్ వచ్చే లోపు 2027 సమ్మర్ అవుతుంది. అప్పుడు పవన్ డేట్స్ తీసుకోవాలి.

అక్కడి నుంచి ఎంత సమయంలోపు ఓజి 2 పూర్తి చేస్తారనేది ఇప్పుడే సమాధానం చెప్పలేని ప్రశ్న. ఇదంతా తేలకుండా పదే పదే ఓజి నామస్మరణ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా పవన్ విడాకుల వ్యవహారం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న టైంలో ఇలా ఓజి 3 అంటూ లీకులు వదలడం అంతగా వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ కాదు. తమన్ ఇంత లోతుగా ఆలోచించే ఛాన్స్ లేదు కాబట్టి వీలు దొరికినప్పుడంతా ఓజి ఆయుధాన్ని వాడేస్తున్నారు.

చెప్పాలంటే ఓజి మూడు వందల కోట్ల దాకా వసూలు చేసింది కానీ ఇండస్ట్రీ రికార్డులు సృష్టించలేదు. చాలా కాలంగా సక్సెస్ లేని పవన్ కళ్యాణ్ కు ఒక పెద్ద హిట్టు ఇచ్చింది. అందుకే ఫ్యాన్స్ అంతగా దాని మీద కల్ట్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. సుజిత్ అయితే స్క్రిప్ట్ పనులు ఎప్పుడో పూర్తి చేసుకున్నారట. పవన్ డేట్స్, ఆరోగ్యం సమస్యల వల్ల షూట్ కు టైం పడుతోంది. ఈలోగా బ్లడీ రోమియో అయిపోతుంది కాబట్టి, 2027 వేసవికి అయినా ఓజి 2 సెట్స్ పైకి వెళ్తే 2028 థియేటర్ రిలీజ్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.