పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లబోతూ తమిళ టాప్ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం.. జననాగయన్. ఇది తెలుగు హిట్ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అయినప్పటికీ.. విజయ్ ఇమేజ్‌కు, తన రాజకీయ భావజాలానికి తగ్గట్లు మార్పులు చేయడం.. పైగా విజయ్ లాస్ట్ మూవీ కావడంతో తమిళంలో మామూలు హైప్ రాలేదు. ఇదొక సగటు మాస్ మసాలా మూవీనే అయినా.. రూ.500 కోట్ల మేర బిజినెస్ చేసే స్థాయికి చేరుకుంది.
ఈ సంక్రాంతికి రిలీజ్ అయి ఉంటే తమిళ సినిమా రికార్డులన్నీ బద్దలు అయిపోయేవే. కానీ సెన్సార్ సమస్యలు చుట్టుముట్టి ఈ చిత్ర విడుదల ఆగిపోయింది. మధ్యలో సినిమా ఆన్ లైన్లో లీక్ కావడం వల్ల చాలా నష్టమే జరిగింది. కానీ ఈ సినిమాకు ఎదురైన ఇబ్బందుల వల్ల విజయ్ మీద సానుభూతి పెరిగి అంతిమంగా ఎన్నికల్లో అతడికి మంచే జరిగిందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి ఇప్పుడు ఫలితాలు చూస్తే.
విజయ్ ఏకంగా సీఎం అవుతున్నాడు కాబట్టి ‘జననాయగన్’కు అడ్డంకులు తొలగినట్లే. ఈ నెలాఖర్లో ఈ చిత్రం విడుదల కావచ్చని అంటున్నారు.
విజయ్ ఫ్యాన్స్ విజయోత్సాహంలో ఉండగా ‘జననాయగన్’ కానున్న నేపథ్యంలో థియేటర్లలో సెలబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది? ఐతే తెలుగు కూడా ఈ చిత్రానికి బంపర్ కలెక్షన్లు వస్తే ఆశ్చర్యమేమీ లేదు.
జనవరిలో ‘జననాయగన్’ తెలుగులో రిలీజై ఉంటే మన జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదేమో. అప్పుడు సంక్రాంతికి ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ లాంటి భారీ చిత్రాల మధ్య పోటీలో రిలీజయ్యేది. దానికి సరిపడా థియేటర్లు దొరికేవి కావు. అన్ని ఆప్షన్లు ఉండగా తెలుగు నుంచి రీమేక్ అయిన తమిళ అనువాద చిత్రాన్ని మన వాళ్లు పట్టించుకునేవారు కాదు.
కానీ ఇప్పుడు విజయ్ సీఎం కాబోతున్న నేపథ్యంలో తన చివరి చిత్రం చూడాలనే ఆసక్తి మన వాళ్లలోనూ ఉంటుంది. పైగా వేసవిలో పెద్ద సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్న సమయంలో ‘జననాయగన్’ రిలీజ్ కాబోతోంది. దీనికి కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతాయి. కాబట్టి ఈ చిత్రం సంక్రాంతి టైంలో కంటే ఇప్పుడే ఎక్కువ ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. కాబట్టి ఈ సినిమా హక్కులు తీసుకున్న వాళ్లు జాక్ పాట్ కొట్టినట్లే.
Gulte Telugu Telugu Political and Movie News Updates