ఛాన్స్ ఇచ్చిన దర్శకుడి పేరు కూతురికి పెడితే?

సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కమెడియన్‌గా చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఇప్పుడు లీడ్ రోల్ చేసే స్థాయికి ఎదిగిన సత్య కూడా తన జీవితాన్ని మార్చిన దర్శకుడి మీద అభిమానాన్ని చూపించాడు. తన ఏకైక సంతానానికి ఆ దర్శకుడి పేరునే పెట్టుకున్నాడు.

కెరీర్ మొదట్లో పెద్దగా గుర్తింపులేని చిన్నా చితకా పాత్రలు చేశాక.. సత్య అందుకున్న పెద్ద అవకాశం.. స్వామిరారా. ఇందులో హీరో స్నేహితుడి పాత్రలో సత్య పంచిన వినోదం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ మూవీతోనే అతను అందరి దృష్టిలో పడ్డాడు. తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. బిజీ కమెడియన్ అయిపోయాడు. ఈ రకంగా ‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్ వర్మ.. సత్య కెరీర్‌ను మార్చేశాడు.

అందుకే ఆ దర్శకుడి మీద అభిమానంతో తన కూతురికి ‘సుధీర’ అని పేరు పెట్టుకున్నాడట. తాను హీరోగా పరిచయం అయిన ‘జెట్లీ’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు సత్య. మీ కుటుంబం గురించి చెప్పమని యాంకర్ అడిగితే.. తనకు ఒక కూతురని, తన పేరు సుధీర అని చెప్పాడు సత్య.

ఈ పేరేంటి కొత్తగా ఉంది, ఎక్కడ వినలేదే అని అడిగితే.. తన కమెడియన్‌గా తొలిసారిగా ఫుల్ లెంత్ రోల్ ఇచ్చి, తన కెరీర్‌ను మార్చిన సుధీర్ మీద ప్రేమతో కూతురికి ఆ పేరు పెట్టుకున్నట్లు సత్య వెల్లడించాడు.

ఇంతలో మత్తు వదలరా, మత్తు వదలరా సినిమాతో సత్యను స్టార్ కమెడియన్‌ను చేసి ‘జెట్లీ’తో అతణ్ని హీరోగా కూడా మార్చిన దర్శకుడు రితేష్ రాణా అందుకున్నాడు. మరి కొడుకు పుడితే నా పేరు పెట్టుకుంటావా అని అడిగితే.. కచ్చితంగా తనకు అబ్బాయి పుడితే ‘రితేష్’ అనే పేరే ఫిక్స్ చేస్తానని స్పష్టం చేశాడు సత్య.