సీరియస్ వద్దు… సరదా కావాలంటున్న ఫ్యాన్స్

కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్ అల్లుడిగా ఎక్కువ గుర్తింపు ఉన్నా చాలా తక్కువ టైంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న హీరోగా ధనుష్ కు తమిళంలోనే కాదు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉంది. రఘువరన్ బిటెక్ దెబ్బకు ఇక్కడా అభిమానులు ఏర్పడ్డారు. కాకపోతే తర్వాత హిట్ల కన్నా ఫ్లాపులే ఎక్కువ కావడంతో మార్కెట్ క్రమంగా మసకబారింది. సాలిడ్ బ్లాక్ బస్టర్ ఒకటి పడితే అన్నీ సర్దుకుంటాయి. అయితే ఇక్కడ ప్రస్తావిస్తున్న అంశం జయాపజయాల గురించి కాదు.

గత కొన్నేళ్లుగా ధనుష్ హీరో అణిచివేతకు గురికాబడి తర్వాత తిరగబడే పాత్రలు ఎక్కువగా చేస్తున్నాడు. తాజాగా విడుదలైన కర ఇదే కోవలోకి చేరుతుంది. బ్యాంక్ లోన్లకు తండ్రి ప్రాణాలు కోల్పోతే, దొంగతనాలు చేసి వాళ్లకు బుద్ది చెప్పే కన్నస్వామిగా ధనుష్ చాలా సీరియస్ గా నటించాడు. దీనికన్నా ముందు వచ్చిన ఇడ్లి కడాయ్ లో కూడా ఇంతే. రెస్టారెంట్ ఓనర్ అవమానపరిస్తే స్వంత ఊరికి వచ్చి తండ్రి మాట కోసం చిన్న హోటల్ పెట్టుకుని జీవితంలో గెలుస్తాడు.

ఇక కుబేర సంగతి సరేసరి. బిచ్చగాడి వేషంలో ధనుష్ ఎన్ని సెకండ్లు నవ్వి ఉంటాడో చెప్పడం కష్టం. బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మేలో మరీ ఓవర్ డెప్త్ తో జనాన్ని భయపెట్టాడు. హిందీలో ఏమో కానీ తమిళ తెలుగులో అల్ట్రా డిజాస్టర్ అయ్యింది. కెప్టెన్ మిల్లర్ తెలుగు డబ్ థియేటర్ రిలీజ్ చేయకుండా ఓటిటికి ఇవ్వడంలోనే నిర్మాతల భయాన్ని అర్థం చేసుకోవచ్చు. రాయన్ కూడా ఇదే బాపతు. గ్యాంగ్ స్టర్ డ్రామాలో తమ్ముళ్ల కోసం రౌడీగా మారతాడు.

ఒక్క సార్ లో మాత్రమే ధనుష్ చక్కగా, హుందాగా టీచర్ పాత్రలో భేషుగ్గా అనిపిస్తాడు. ఇది మన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తీశాడనే విషయం మర్చిపోకూడదు. 2022లో వచ్చిన తిరు తరహా సినిమాలు తను మరిన్ని చేయాలని అభిమానుల కోరిక. పదే పదే నిన్ను సీరియస్ గా చూడలేమని, ఇలాంటివి మాత్రమే గొప్ప యాక్టింగ్ అనే భ్రమలో ఉండొద్దని కోరుతున్నారు. వాళ్ళ అభ్యర్థనలో లాజిక్ ఉంది. స్టార్ హీరో అన్నాక జానర్లు మారాలి, ఎక్స్ పరిమెంట్లు చేయాలి.