మాయాబజార్ పాటా కాపీయా?

తెలుగులో ఇప్పుడు ఏదైనా ఒక మంచి పాట రిలీజైతే సంగీత ప్రియులు ఓవైపు దాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు ఆ సాంగ్ కోసం ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందారో అని అనుమానంగా చూసే పరిస్థితులు వచ్చేశాయి. ఒరిజినల్ ట్యూన్స్‌తో పాటలు కంపోజ్ చేసే సంగీత దర్శకుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతుండడమే అందుక్కారణం. టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పేరున్న వాళ్లు కూడా తరచుగా కాపీ, ఇన్‌స్పిరేషన్ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటారు.

ఎక్కడి నుంచో కాపీ కొట్టడం ఒకెత్తయితే.. తమ పాటలను పోలిన పాటలనే రిపీట్ చేసే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఉన్నారు ప్రస్తుత ఇండస్ట్రీలో. ప్రపంచంలో ఎక్కడి సంగీతాన్ని కాపీ కొట్టినా సరే.. ఈ ఇంటర్నెట్ యుగంలో నిమిషాల్లో నెటిజన్లు ఆ సంగతి కనిపెట్టేసి మ్యూజిక్ డైరెక్టర్ల బండారం బయటపెట్టేస్తున్నారు.

ఐతే ఎన్నో దశాబ్దాల కిందట పాశ్చాత్య సంగీత ప్రభావం మన సినిమాలపై లేని రోజుల్లో కూడా ఈ కాపీ-ఇన్‌స్పిరేషన్ సంస్కృతి ఉందంటూ విలక్షణ దర్శకుడు రవిబాబు తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించాడు.

తెలుగు సినీ చరిత్రలోనే ది బెస్ట్ మూవీగా పేరున్న ‘మాయాబజార్’లో ‘వివాహ భోజనంబు’ పాట ఎంత ఫేమస్సో తెలిసిందే. ఆ పాట ఒక హాలీవుడ్ సాంగ్ నుంచి స్ఫూర్తి పొంది తీర్చిదిద్దింది అని రవిబాబు ఇంటర్వ్యూలో వెల్లడించాడు. యుఎస్‌లో 1935లో వచ్చిన ‘ది లాఫింగ్ పోలీస్‌మ్యాన్’ అనే ఒక పాట నుంచి స్ఫూర్తి పొంది కంపోజ్ చేశారని రవిబాబు వెల్లడించాడు.

ఆ పాట వింటే.. రవిబాబు మాటల్లో పొరపాటేమీ లేదని అర్థమవుతుంది. ట్యూన్‌తో పాటు ఘటోత్కచుడు నవ్వే నవ్వు కూడా అక్కడి నుంచి ఇన్‌స్పైర్ అయిందే అని తెలుస్తుంది. 1935లో వచ్చిన పాట స్ఫూర్తితో 20 ఏళ్ల తర్వాతి ఇలా తెలుగులో ఒక పాట చేయడం ఆశ్చర్యమన్నాడు రవిబాబు. ప్రతి ఒక్కరూ ఒరిజినల్ సాంగే కంపోజ్ చేయాలని అనుకుంటారు కానీ.. ఇలాంటి ఇన్‌స్పిరేషన్‌లు సినీ రంగంలో కామన్ అని ఆయన అభిప్రాయపడ్డాడు.