థియేటరే కాదు ఓటిటిలోనూ పోటీ

ఒకే రోజు రెండు మూడు సినిమాలు విడుదల కావడం టాలీవుడ్ కు కొత్తేమి కాదు. కొన్ని వందల వేల సార్లు బాక్సాఫీస్ ఇలాంటి క్లాషులు చూసింది. అయితే ఒకే రోజు థియేటర్లో కలబడిన చిత్రాలు ఒకే రోజు ఒకే ఓటిటిలో తలపడటం అరుదే. అలాంటి ఫీట్ మే 1 జరగనుంది. శర్వానంద్ బైకర్, సంగీత్ శోభన్ రాకాస నెట్ ఫ్లిక్స్ వేదికగా సేమ్ టైంలో స్ట్రీమింగ్ మొదలుపెట్టబోతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చేసింది. మల్టీలాంగ్వేజ్ ఆప్షన్స్ ఇస్తున్నట్టు యాడ్ లో చెప్పేశారు.

ఇలా ఎందుకు జరిగిందంటే అగ్రిమెంట్ టైంలోనే థియేటర్ రిలీజ్ జరిగిన నాలుగు వారాలకు ఓటిటిలో విడుదల చేస్తామని ముందుగానే రాసుకోవడం వల్ల. నిజానికి బైకర్ గత డిసెంబర్ లోనే రావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ తదితర పనుల వల్ల మూడు నెలలు లేట్ అయ్యింది. రాకాస కూడా ఒక డేట్ మార్చుకోవాల్సి వచ్చింది. మధ్యలో దురంధర్ ది రివెంజ్ ప్రభావం ఒక కారణంగా చెప్పొచ్చు. అలా రెండు సినిమాలూ ఏప్రిల్ 3 థియేటర్లలో అడుగు పెట్టాయి.

వీటి కమర్షియల్ లెక్కల విషయానికి వస్తే బైకర్ ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. నిర్మాతలు నలభై కోట్లకు పైగా వచ్చిందంటూ పెద్ద నెంబరే పోస్టర్స్ లో వేసుకున్నారు కానీ వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉందని గ్రౌండ్ లెవెల్ కలెక్షన్లు చూసిన ఎవరైనా ఒప్పుకుంటారు. కాకపోతే కంటెంట్, ఎమోషన్, నిజాయితీ పరంగా బైకర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక రాకాస మూడు రోజులు జోరుగా ఉండి ఆ తర్వాత నెమ్మదించి ఎలాగోలా బ్రేక్ ఈవెన్ దాటేసింది.

ఒకపక్క ఓటిటి విండో ఎనిమిది వారాలు ఉండాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో ఇలా నెల రోజుల గ్యాప్ ని వదులుకోవడం నిర్మాతల వల్ల కావడం లేదు. థియేటర్ రెవిన్యూల మీదే ఆధారపడితే మీడియం బడ్జెట్ సినిమాలు గట్టెక్కవని, అందుకే విధి లేక నాలుగు వారాలకు ఓకే చెబుతున్నామనేది టాప్ ప్రొడ్యూసర్స్ మాట. ఏది ఎలా ఉన్నా ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. ఎప్పటిలాగే థియేటర్స్ లో మిస్సయిన సినిమాలను కేవలం నెలకే ఓటిటిలో చూడటమైతే కొనసాగుతుంది.