కౌంట్ డౌన్ 55… పెద్ది డిస్కషన్లు బంద్

వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల సహనంతో ఆడుకున్న పెద్ది విడుదల తేదీ వ్యవహారం కొలిక్కి వచ్చేసింది. ధనుష్ కర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన దర్శకుడు బుచ్చిబాబు అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ ఒత్తిడి భరించలేక జూన్ 25 అని పబ్లిక్ స్టేజి మీద ప్రకటించేశారు. నిజానికీ డేట్ ముందే తెలిసినప్పటికీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కొత్త పోస్టర్ రూపంలో వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ రూపంలో బయటికి వచ్చేసింది.

ఇక పెద్ది డిస్కషన్లకు ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఏప్రిల్ మినహాయిస్తే బుచ్చిబాబు చేతిలో కేవలం 55 రోజుల సమయం ఉంటుంది. ఐటెం సాంగ్ ఆల్రెడీ మొదలైపోయింది కాబట్టి ఇంకో మూడు రోజుల్లో గుమ్మడికాయ కొట్టేస్తారు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మహా అయితే ఇంకో వారం అదనం అంతే. గుమ్మడికాయ కొట్టేందుకు టీమ్ రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది ప్రమోషన్ల మీద. చికిరి చికిరి, రైరై రారై పాటలు ఆల్రెడీ ఛార్ట్ బస్టర్ అయ్యాయి.

మిగిలిన సాంగ్స్ కి రంగం సిద్ధం చేయాలి. అసలైన ట్రైలర్ ని ఎప్పుడు వదులుతారోనని మూవీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. జూన్ మొదటి వారం దాకా వెయిట్ చేయాల్సి రావొచ్చు. ఈలోగా పాటల లాంఛనాలు పూర్తయిపోతాయి. రీ రికార్డింగ్ కోసం ఏఆర్ రెహమాన్ ఇంకా డేట్స్ ఇవ్వలేదని వినికిడి. సెకండాఫ్ కాపీ రెడీ అయ్యాక బుచ్చిబాబు కబురు పెట్టగానే మే మూడో వారంలో కాల్ షీట్స్ ఇస్తారని టాక్. తగినంత టైం ఇస్తే రెహమాన్ నుంచి బెస్ట్ బీజీఎమ్ ఆశించవచ్చు.

ఇప్పుడు మెయిన్ గా టార్గెట్ చేయాల్సింది నార్త్ ఇండియా ప్రమోషన్లు. పుష్ప 2 స్థాయిలో డిమాండ్ ఉన్నప్పుడు దానికి తగ్గ ప్రచారం కూడా జరగాలి. రామ్ చరణ్ డాన్సులు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఇక పెర్ఫార్మన్స్ పరంగా తనేం చేశాడనే శాంపిల్స్ ట్రైలర్ లో చూపిస్తే చాలు హైప్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. వినడానికి జూన్ 25 దూరంగా ఉన్నట్టు అనిపిస్తోంది కానీ పెద్ది టీమ్ పడుతున్న ప్రెజర్ చూసుకుంటే ఎనిమిది వారాలు కర్పూరంలా కరిగిపోయేలా ఉన్నాయి.