ఓటీటీలకు బ్రేక్ పడినట్లేనా?


లాక్ డౌన్ టైంలో ఓటీటీలకు డిమాండ్ ఎంతగా పెరిగిందో.. వాటి సబ్‌స్క్రిప్షన్లు ఏ రేంజిలో పెరిగాయో తెలిసిందే. ఇంతకుముందు థియేటర్లలో సినిమాలు రిలీజైన నెలా నెలన్నరకు మహా భాగ్యం అన్నట్లుగా తీసుకుని రిలీజ్ చేసుకున్న ఓటీటీలు.. కరోనా పుణ్యమా అని పేరున్న కొత్త సినిమాలను నేరుగా తమ వేదికల్లో రిలీజ్ చేసుకునే స్థితికి వచ్చాయి.

ఇలా గత ఆరేడు నెలల్లో వివిధ భాషల్లో పదుల సంఖ్యలో కొత్త చిత్రాలు ఓటీటీల ద్వారా నేరుగా విడుదలయ్యాయి. థియేటర్లు ఎంతకీ తెరుచుకోకపోవడంతో ఓటీటీల హవా ఇంకా పెరుగుతూ పోయింది. ముందు ఓటీటీలు వద్దు, థియేటర్లే ముద్దు అన్న నిర్మాతలు సైతం ఆ తర్వాత మనసు మార్చుకుని తమ చిత్రాలను డిజిటల్ రిలీజ్‌కు ఇచ్చేశారు. లాక్ డౌన్ వల్ల మూత పడ్డ థియేటర్లను మళ్లీ తెరవడానికి అక్టోబరు మధ్యలోనే అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయినా సరే.. ఓటీటీల జోరేమీ తగ్గలేదు.

వెంటనే థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోయినా త్వరలోనే అక్కడ సినిమాలు నడుస్తాయని తెలిసినా ఓటీటీల్లో కొత్త చిత్రాల విడుదలేమీ ఆగిపోలేదు. నెల రోజుల వ్యవధిలో కలర్ ఫోటో, మిస్ ఇండియా, ఆకాశం నీ హద్దురా, మా వింత గాథ వినుమా, మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి పేరున్న సినిమాలు ఓటీటీల్లో నేరుగా విడుదలై సందడి చేశాయి. దీంతో థియేటర్లలో మళ్లీ సందడి మొదలైనా.. ఓటీటీల జోరు తగ్గదేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయేలా కనిపిస్తోంది. థియేటర్లలో కొత్త సినిమాలు నడిపించే విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది.

ఇటీవలే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదలై భలేగా ఆడేస్తోంది. ప్రేక్షకులు ఏ సంశయం లేకుండా థియేటర్లకు వచ్చేస్తున్నారు. యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాను కూడా బాగానే ఆదరిస్తున్నారు. ఈ ఊపులో సంక్రాంతికి ఒకటికి నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఇంత ఉత్సాహం ప్రదర్శిస్తుంటే.. ఇక పూర్తి స్థాయిలో థియేటర్లు నడిస్తే.. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ అటు వైపే వెళ్తాయి. థియేట్రికల్, డిజిటల్ రైట్స్‌ను వేర్వేరుగా అమ్మితే వచ్చే ఆదాయంతో పోలిస్తే.. కేవలం డిజిటల్ రిలీజ్ కోసం ఒప్పందం చేసుకుంటే వచ్చే ఆదాయం కచ్చితంగా తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇకపై చిన్నా చితకా చిత్రాలు తప్పిస్తే.. పేరున్న కొత్త సినిమాలు ఓటీటీల్లో నేరుగా రిలీజ్ కావడం సందేహమే.