ప్రతాప్ కోరుకున్న పుణ్యం ఏమయ్యింది

హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో లాంటి ఎంటర్ టైనర్ రెండింటితో మెప్పించడం తనకే చెల్లింది. అయితే ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం తిరువీర్ ఇమేజ్, మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్న మాట వాస్తవం. అందుకే ఓటిటిలో చూసి మెచ్చుకోకుండా ముందు థియేటర్లకు రమ్మని, పాపం ప్రతాప్ పెద్ద తెరపై చూసి పుణ్యం కట్టుకోమని పదే పదే విన్నపాలు చేశాడు.

ప్రమోషన్లు విస్తృతంగా చేయడంతో పాపం ప్రతాప్ మీద ఆడియన్స్ అటెన్షన్ వచ్చింది. చాలా కొత్త పాయింట్ తో కామెడీ, ఎమోషన్స్ అన్నీ మేళవించి తీశామని దర్శక నిర్మాతలు పదే పదే చెప్పుకున్నారు. అయితే పబ్లిక్ టాక్, రివ్యూస్ ఈ మూవీకి ఏమంత ఆశాజనకంగా రాలేదు. హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో ఫుల్ అయిన కొన్ని స్క్రీన్లు ఫుల్స్ చూపించి బ్లాక్ బస్టర్ ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు కానీ బిసి సెంటర్లలో పాపం ప్రతాప్, తిమ్మరాజుపల్లి టీవీ రెండూ నెమ్మదిగానే ఉన్నాయి.

ఎలా చూసినా తిరువీర్ కోరుకున్న యునానిమస్ హిట్ అయితే పాపం ప్రతాప్ ఇవ్వడం అనుమానమే. ఎందుకంటే వీకెండ్ లోనే వసూళ్లు వేగంగా లేనప్పుడు రేపు సోమవారం నుంచి డ్రాప్స్ ఆందోళనకరంగా ఉంటాయి. వాటిని ఎలా మేనేజ్ చేసుకుంటారనేది వేచి చూడాలి. పాయింట్ లో వైవిధ్యం ఉన్నప్పటికీ దాన్ని ప్రెజెంట్ చేసిన తీరులో దర్శకుడు తడబడటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను పాపం ప్రతాప్ చేరుకోలేకపోతున్నాడు. అదే సమస్యగా మారింది.

ఇది భారీ హిట్ అయితే తిరువీర్ తర్వాతి సినిమా భగవంతుడుకి బిజినెస్ పరంగా ప్లస్ అయ్యేది. రిజల్ట్ ఎలా ఉన్నా జానర్ పరంగా రెండు వేర్వేరు క్యాటగిరీలు కాబట్టి పబ్లిసిటీ బాగా చేసుకుంటే దానికొచ్చే ఆడియన్స్ వేరుగా ఉంటారు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో డివోషనల్ టచ్ తో థ్రిల్లర్ టైపులో తీశారు. విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసనితో బాక్సాఫీస్ ఫ్లాప్ చూసిన ఈటీవీ విన్ కు పాపం ప్రతాప్ మాత్రం లిటిల్ హార్ట్స్ రేంజ్ సక్సెస్ ఇవ్వడం కష్టమే.