సీపీఐ అగ్ర నేత, పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణకు అక్కినేని నాగార్జునపై కోపం వచ్చింది. విలేకరుల సమావేశంలో నాగార్జున మీద ఆయన ఫైర్ అయిపోయారు. నారాయణ ఏంటి.. నాగార్జున మీద ఆగ్రహించడమేంటి.. వీళ్లిద్దరి మధ్య వైరం ఏంటి.. నారాయణకు నాగ్ కోపం తెప్పించిన అంశమేంటి అని ఆసక్తి కలగడం ఖాయం.
నాగ్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్ బాస్ షో మీద నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ షోలో నాగ్ తీరు దారుణంగా ఉందన్నారు. ఈ షో కాన్సెప్టే తప్పన్న నారాయణ.. దాన్ని నాగ్ నిర్వహిస్తున్న తీరు మరింత అభ్యంతరకరంగా ఉందన్నారు. ఈ షో మీద చర్యలు తీసుకోమని పోలీసులను కోరినా పట్టించుకోవట్లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ బిగ్ బాస్ షో, నాగార్జున హోస్టింగ్ విషయంలో నారాయణకున్న అభ్యంతరాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
తనకు అక్కినేని నాగార్జున అంటే చాలా అభిమానమని.. ఆయన సినిమాలు చూస్తుంటానని… కానీ ఆయన బిగ్‌బాస్ షోలో మాత్రం దరిద్రపు పనులు చేశారని నారాయణ అన్నారు. బిగ్‌బాస్‌లో ముగ్గురు అమ్మాయిల ఫోటోలు పెట్టి వీరిలో ఎవరిని కిస్ చేస్తావు, ఎవరితో డేటింగ్ చేస్తావు, ఎవరిని పెళ్ళి చేసుకుంటావు అని ఓ యువకుడిని నాగార్జున అడగడం దారుణమని నారాయణ అన్నారు. నాగ్ ఓపెన్‌గా ఇలాంటి ప్రశ్న వేస్తే.. బదులిచ్చిన వ్యక్తి కూడా అంతే ఓపెన్‌గా మాట్లాడటం అవమానకరమని నారాయణ చెప్పారు. నాగార్జున తన ఇంట్లోని మహిళా నటుల ఫొటోలు పెట్టి ఇలా అడగ్గలడా అని ఆయన ప్రశ్నించారు. ఇన్నేళ్లూ పద్ధతిగా ఉన్న నాగార్జున ఈ షో కోసం ఇప్పుడెందుకిలా చేస్తున్నాడని ఆయన అడిగారు.
ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్లు, కోర్టుకు వెళ్లామని.. కనీసం కింది కోర్టులు.. అలాగే జిల్లా కోర్టులు కూడా కేసులు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనది పితృభూమి కాదు, మాతృభూమి అని.. మహిళలకు ఇచ్చే స్థానం ఇదేనా..?. మహిళల గురించి ఇంత అన్యాయంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే ఈ షోపై హైకోర్టులో కేసు వేస్తానని.. ఎంత వరకైనా పోరాడతానని చెప్పిన నారాయణ.. నాగార్జున ఈ విషయమై సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates