ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లానింగా?

మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్ మూవీ కాదు. అందులోని భారీతనం.. విజువల్ ఎఫెక్ట్స్.. ముఖ్య పాత్రలు, పెర్ఫామెన్సులు ఆకట్టుకుంటాయి. కానీ సినిమా మీద మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టేయడంతో కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ ఏకంగా రూ.400 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. దాదాపు వంద కోట్ల మేర నష్టం వచ్చినట్లు అప్పట్లో ట్రేడ్ పండిట్లు అంచనా వేశారు. 

కానీ బడ్జెట్ లెక్కల్ని పక్కన పెట్టి చూస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఉన్నంతలో ఆ సినిమా బాగానే ఆడింది. ‘బ్రహ్మాస్త్ర’ చివర్లో పార్ట్-2కు హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి ఇంకో రెండు సీక్వెల్స్ చేయాలనుకున్నాడు. కానీ పార్ట్-1 కాస్ట్ ఫెయిల్యూర్ కావడంతో తర్వాత సీక్వెల్ కబుర్లు వినిపించలేదు. నిర్మాత కరణ్ జోహార్‌కు కూడా సీక్వెల్ తీసే ఉద్దేశం లేదని స్పష్టమైంది.

కానీ ఇప్పుడు వేరే నిర్మాత.. బ్రహ్మాస్త్ర ఫ్రాంఛైజీని ముందుకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఆయనే.. నమిత్ మల్హోత్రా. ‘రామాయణ’ రెండు భాగాల మీద ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెడుతున్న ప్రొడ్యూసర్ ఆయన. ఇది చాలా రిస్కీ ప్రాజెక్టు అని ట్రేడ్ అంచనా వేస్తున్నప్పటికీ.. నమిత్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ జరుగుతుందని.. పెట్టుబడి వెనక్కి రావడంతో పాటు లాభాలూ అందుకుంటానని ధీమాగా ఉన్నాడు. ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘బ్రహ్మాస్త్ర’ ఫ్రాంఛైజీలో తర్వాతి భాగాలను తనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. ఇందుకోసం స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందని వెల్లడించారు.

‘బ్రహ్మాస్త్ర’లో హీరోగా నటించిన రణబీర్ కపూరే.. ‘రామాయణ’లో రాముడి పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ హీరోతో నమిత్‌కు మంచి అనుబంధం ఏర్పడిన నేపథ్యంలో తనతో ‘బ్రహ్మాస్త్ర-2’ చేయడానికి రెడీ అయినట్లున్నాడు నమిత్. రణబీర్ చేసిన శివ పాత్ర కేంద్రంగా ‘బ్రహ్మాస్త్ర’లో పార్ట్-1 నడిచింది. పార్ట్-2 శివ తండ్రి పాత్ర దేవ్ ఆధారంగా నడుస్తుంది. తండ్రి పాత్రలోనూ రణబీరే నటిస్తాడా.. లేక తన పాత్రను అలాగే కొనసాగిస్తూ, వేరే నటుడిని ఈ క్యారెక్టర్లో చూపిస్తారా అన్నది ఆసక్తికరం.