మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించిందో తెలిసిందే. తనకన్నా ఇరవై సంవత్సరాల పెద్ద వయసున్న హీరోని ప్రేమించే క్యారెక్టర్ లో తన బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్, చలాకీతనంలో మమిత చూపించిన నేర్పు యువతని, ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఏ ఉద్దేశంతో అయితే మ్యాడీని డిజైన్ చేశారో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరడంలో మమిత చేసిన కృషి పెద్దదే.

తాజాగా మలయాళంలో మమిత బైజు కొత్త సినిమా ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ విడుదలయ్యింది. డబ్బింగ్ వెర్షన్లకు థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో పాటు, హీరో నివిన్ పౌలికి మన దగ్గర మార్కెట్ లేని కారణంగా ఆ రిస్క్ తీసుకోలేదు. ఈ లవ్ ఎంటర్ టైనర్ కి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. సోషల్ మీడియా రెస్పాన్స్ గమనిస్తే అధిక శాతం ప్రేక్షకులు ప్రశంసలు గుప్పించారు. కొంత గ్యాప్ తర్వాత మంచి ఫ్యామిలీ రామ్ కామ్ చూశామని మెచ్చుకుంటున్నారు.

విచిత్రం ఏమిటంటే ఈ బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కూడా వయసు వ్యత్యాసం మీద నడిచే స్టోరీనే. స్నేహితురాలి పెళ్లి కోసం విదేశాల నుంచి కేరళ వస్తుంది ఆష్లే (మమిత బైజు). ఆ వేడుక జరుగుతున్న టైంలో ఆమెకు గత లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది. ఎంతో ఇష్టపడి ప్రేమించిన జస్టిన్ (నివిన్ పౌలి) తనకన్నా పది సంవత్సరాలు పెద్దవాడు కావడంతో ఊరి జనాల పుకార్లు, బంధువుల వేధింపులు, ఇంట్లో గొడవల వల్ల పెళ్లి దాకా వెళ్ళదు. మరి తిరిగి వాళ్ళు కలుసుకున్నారా లేదానేది స్టోరీ.

ప్రేమలు లాంటి క్లాసిక్ తీసిన గిరీష్ ఏడి ఈ మూవీకి దర్శకుడు. సెకండాఫ్ ప్రారంభంతో పాటు అక్కడక్కడా కొంత నెమ్మదితనం ఉన్నా వినోదానికి లోటు లేకుండా రాసుకున్న తీరు, ఎమోషన్స్ ని టచ్ చేసిన విధానం ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. విష్ణు విజయ్ సంగీతం పెద్ద ప్లస్ అయ్యింది. క్లైమాక్స్ హార్ట్ టచింగ్ గా రాసుకోవడం బాగుంది. మొత్తానికి మమిత బైజుకి ఏజ్ డిఫరెన్స్ సినిమాలు రెండు బ్యాక్ టు బ్యాక్ వచ్చి రెండూ సక్సెస్ కావడం అరుదైన విషయంగా చెప్పుకోవాలి.