పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత కూడా రిలీజైన మొదటి రోజే కెమెరా ప్రింట్లను బయటికి రాకుండా చేయడంలో ఎవరూ సక్సెస్ కాలేకపోతున్నారు. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను అరెస్ట్ చేసిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. కొంత నియంత్రణ కనిపించింది కానీ పూర్తిగా ఆగిపోలేదు. చేసేవాళ్ళు భయపడి వెనక్కు వెళ్ళలేదు. తమ పని తాము కానిస్తున్నారు.

తాజాగా ఒక కొత్త తలనెప్పి వచ్చి పడింది. ఇవాళ హాలీవుడ్ మూవీ మ్యూటినీ రిలీజయ్యింది. అయితే దీని ఓటిటి హక్కులు కొన్న సంస్థ పొరపాటున ఒక రోజు ముందు తమ వెబ్ సైట్ లో హెచ్డి ప్రింట్ స్ట్రీమింగ్ లో పెట్టేసింది. కొన్ని గంటల పాటు అది అలాగే ఉంది. ఇది గుర్తించి నిర్మాణ సంస్థ వెంటనే అలెర్ట్ చేయడంతో తీసేసింది కానీ ఈలోగానే పైరసీ వీరులు ఆ ప్రింట్ ని పట్టేసి ఆన్ లైన్ లోకి తెచ్చేశారు. దీంతో ప్రీమియర్ షోల కన్నా లక్షలాది మంచి మ్యుటినీ చూసేశారు.

జేసన్ స్టాథం లాంటి స్టార్ నటించిన మూవీకి సైతం ఇలాంటి బెడద తప్పలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత కొంత కాలంగా దీన్ని అరికట్టే పద్ధతులు తెలియక ఇంటర్నేషనల్ ఓటిటిలు సైతం నిస్సహాయంగా మిగిలిపోయాయి. ఇప్పుడు అవే పొరపాట్ల పేరుతో ఇంత దారుణమైన పని చేస్తే కోట్లు ఖర్చు పెట్టి తీసిన కంటెంట్ కి రక్షణ ఎక్కడ ఉంటుంది. ఇంక ఎవరి మీద నమ్మకం వస్తుంది. అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే.

ఈ మ్యుటిని సంగతేమో కానీ ఇకపై ప్రొడ్యూసర్లు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అత్తారింటికి దారేది నుంచి వారణాసి దాకా ఈ లీకులు పైరసీలు ఇండస్ట్రీకి నరకం చూపిస్తున్నాయి. చట్టాలు కఠినంగా లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణంగా చెప్పొచ్చు. మ్యుటినీ ప్రింట్ బయటికి వచ్చింది కేవలం యుఎస్ లో అయినా పైరసీ పుణ్యమాని ప్రపంచం మొత్తానికి అందుబాటులోకి వచ్చేసింది. ముందు ముందు ఇంకెన్ని విచిత్రాలు చూడాలో.