శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక ముందే షావుకారు జానకి శాశ్వత సెలవు తీసుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న జానకి గారు చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆవిడ వయసు 94 సంవత్సరాలు. ఎన్నో మర్చిపోలేని ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో నటించిన జానకిని 2022 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. 1931 డిసెంబర్ 12 వెంకోజీ రావు, శచీదేవి దంపతులకు జన్మించారు. ఇద్దరూ ఉన్నత విద్యావంతులు. స్వస్థలం రాజమండ్రి. పదకొండు సంవత్సరాల వయసులో రేడియో ప్రోగ్రాంలో పాల్గొన్న జానకి 1950 మొదటి సినిమా షావుకారునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. డెబ్యూనే గొప్ప పేరు తీసుకు రావడంతో వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అక్కడి నుంచి సుమారు 385 పైగా సినిమాల్లో తన అసమాన నటనను ప్రదర్శించారు.

పాండురంగ మహత్యం, చరణదాసి, భాగ్యరేఖ, పిచ్చి పుల్లయ్య, కన్యాదానం, వద్దంటే డబ్బు, రోజులు మారాయి, రేచుక్క, శ్రీ వెంకటేశ్వర మహత్యం, జయం మనదే, బాటసారి, మంచి మనసులు, భామా విజయం, డాక్టర్ చక్రవర్తి, సవతి కొడుకు లాంటి ఎన్నో క్లాసిక్స్ లో జానకి హీరోయిన్ గా నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారక గీతాంజలి. సంసారం ఒక చదరంగం, శుభాకాంక్షలు,  మేడం, దేవి లాంటి హిట్స్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2023 అన్నీ మంచి శకునములే జానకి గారి చివరి చిత్రం.

సుదీర్ఘమైన ప్రస్థానంలో షావుకారు జానకి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఫిలిం ఫేర్ లైఫ్ టైం అఛీవ్మెంట్, నడిగర్ తిలగం జీవిత కాల సాఫల్యం, ఏఎన్ఆర్ అవార్డు, కర్ణాటక రాజ్యోత్సవ, తమిళనాడు కలైమామణి, సైమా లైఫ్ టైం ఇలా లెక్కలేనన్ని గౌరవాలు జానకి అందుకున్నారు. పాపులర్ హీరోయిన్ కృష్ణకుమారి స్వయానా చెల్లెలు కావడం విశేషం. జానకి గారి భర్త పేరు శంకమంచి శ్రీనివాసరావు. భౌతికంగా దూరమైనా జానకి గారి సినిమాల రూపంలో ఆవిడ ఎప్పుడూ సజీవంగా ఉంటారు.