హీరో వరుణ్ ధావన్ కు అంతో ఇంతో చెప్పుకోదగ్గ ఇమేజ్ ఉంది. అందుకే దర్శకుడు అట్లీ నిర్మాతగా మారి ఏరికోరి తేరి హిందీ రీమేక్ కోసం తనను తీసుకున్నాడు. అది డిజాస్టర్ కావడం వేరే విషయం. వరుణ్ కొత్త మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ వచ్చే నెల విడుదలకు రెడీ అవుతోంది. హీరోయిన్లు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్. ఇవాళ టీజర్ వదిలారు ఇద్దరు చిన్న పిల్లలు మాట్లాడుకుంటూ తమ తండ్రులు ఒక్కరే అనే ట్విస్టు విని షాక్ అవ్వడంతో ముగించారు.
విచిత్రం ఏమిటంటే పిల్లల క్లిప్పును ఏఐలో సృష్టించారు. చూడగానే దొరికిపోయేలా ఉంది. మ్యాటర్ అది కాదు. ఒక ప్రియుడు ఇద్దరు ప్రియురాలు లేదా ఒక భర్త ఇద్దరు భార్యలు కాన్సెప్ట్ తో ఇప్పటిదాకా లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. ఇటీవలే రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఇదే క్యాటగిరీలో వచ్చి యావరేజ్ అయ్యింది. ఇప్పుడీ బాలీవుడ్ మూవీకి దర్శకత్వం వహించిన డేవిడ్ ధావన్ మరీ పాతకాలంలోనే ఉండిపోయారా అంటూ మూవీ లవర్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
90 దశకంలో డేవిడ్ ధావన్ కు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరుండేది. ముఖ్యంగా గోవిందాతో ఆయన తీసిన కూలి నెంబర్ 1 లాంటి చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించాయి. అఫ్కోర్స్ వాటిలో అత్యధిక శాతం రీమేకులే. నాగార్జున హలో బ్రదర్ ని సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేసింది ఈయనే. అంతటి అనుభవమున్న డేవిడ్ ధావన్ తన కొడుకుతో ఇంత అవుట్ డేటెడ్ సబ్జెక్టు తీయడం ఏమిటనే కామెంట్స్ జోరుగా ఉన్నాయి. కథేంటో తెలియకుండానే ఈ రేంజ్ ట్రోలింగ్ నడుస్తోంది.
ఇంకో విషయం చెప్పుకోవాలి. డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ తాను ఆచితూచి సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అడివి శేష్ సైతం తన సెలక్షన్ మీద ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించాడు. తీరా చూస్తే మృణాల్ హిందీలో మాత్రం అత్తెసరు సినిమాలతో ఫ్లాపులు చవి చూస్తోంది. మూడేళ్ళుగా ఇదే తంతు నడుస్తోంది. మరి హై జవానీ తో ఇష్క్ హోనా హై అయినా తన గౌరవాన్ని నిలబెడుతుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
