శివాజీ క‌నిపెట్టిన చీర‌… అన‌సూయ పంచ్

గ‌త ఏడాది ‘దండోరా’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణ గురించి సీనియ‌ర్ న‌టుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంత‌ దుమారం రేపాయో గుర్తుండే ఉంటుంది. ఈ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించి, శివాజీతో మాట‌ల యుద్ధానికి దిగింది న‌టి, యాంక‌ర్ అన‌సూయ‌. కొన్ని రోజుల పాటు వీరి గొడ‌వ సాగింది. ఆ వివాదం స‌ద్దుమ‌ణిగాక కూడా ఎవ‌రో ఒక‌రు సోష‌ల్ మీడియాలో శివాజీ వ్యాఖ్య‌ల‌కు స‌మ‌ర్థింపుగా మాట్లాడ్డం.. వారికి అన‌సూయ కౌంట‌ర్ ఇవ్వ‌డం కొన‌సాగుతూనే ఉంది.

తాజాగా శివాజీ వ్యాఖ్య‌ల‌తో ముడిపెట్టి.. అన‌సూయ డ్రెస్సింగ్ మీద ఒక నెటిజ‌న్ కామెంట్ చేయ‌డంతో ఆమె ఫైర్ అయింది. అన‌సూయ త‌న భ‌ర్త భ‌ర‌ద్వాజ్‌తో క‌లిసి ఒక ఆల‌య సంద‌ర్శ‌న‌కు వెళ్లారు. ఆ సంద‌ర్భంగా ఆమె సంప్ర‌దాయ చీర‌కట్టులో క‌నిపించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ ఒక న్యూస్ ఛానెల్ ఒక కామెంట్ పెట్టింది.

”శివాజీ దెబ్బ‌తో ప‌ట్టు చీర‌లో తిరుగుతున్న అన‌సూయ‌.. దుమారం రేపుతున్న వీడియో”.. అని ఆ కామెంట్‌లో పేర్కొన్నారు. దీనిపై అన‌సూయ ఒకింత ఆగ్ర‌హంగా, వ్యంగ్యంగా స్పందించింది.
”త‌ప్పు త‌ప్పు.. శివాజీ సృష్టించిన చీర అనే వ‌స్త్రాన్ని ధ‌రించి తిరుగుతున్న అన‌సూయ. ఇది క‌దా ఉండాలి హెడ‌ర్. ఎందుకంటే అంత‌కుముందు మేమంతా అస‌లు చీర‌లే క‌ట్టుకోలేదు. ఏంట‌మ్మా చూసుకోవాలి క‌దా పోస్ట్ చేసే ముందు” అని ఆమె కామెంట్ చేసింది.

న్యూస్ ఛానెల్ వీడియోకు పెట్టిన కామెంట్, హెడ్డింగ్ టూమ‌చ్‌గా ఉన్నాయ‌న్న‌ది వాస్త‌వం. సోష‌ల్ మీడియా జనాల దృష్టిని ఆక‌ర్షించ‌డానికే అలా ట్రై చేశార‌ని అర్థ‌మ‌వుతోంది. అన‌సూయ కొంచెం గ‌ట్టిగానే పంచ్ ఇచ్చింది. కానీ ఈ వివాదానికి ఎప్పుడో తెర‌దించి త‌న ప‌ని తాను చూసుకుంటున్న శివాజీ.. టీవీ ఛానెల్ చేసిన అతి వ‌ల్ల మ‌రోసారి అన‌సూయ‌కు టార్గెట్ అయిపోయాడ‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.