అన్న స్ఫూర్తితో త‌మ్ముడు దూక‌బోతున్నాడా?

లాక్ డౌన్ టైంలో సౌత్ ఇండియాలో కొత్త సినిమాల‌ను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసే విష‌యంలో నిర్మాత‌లు త‌ట‌ప‌టాయిస్తున్న స‌మ‌యంలో సూర్య ధైర్యం చేసిన త‌న భార్య జ్యోతిక న‌టించిన పొన్ మ‌గల్ వందాల్‌ను డిజిట‌ల్ మీడియంలో రిలీజ్ చేసి సంచ‌ల‌నానికి తెర తీశాడు.

త‌మిళ‌నాట ఎగ్జిబిట‌ర్లు అడ్డంకులు సృష్టించినా అత‌ను ఆగ‌లేదు. అత‌డిచ్చిన స్ఫూర్తితోనే త‌ర్వాత ద‌క్షిణాదిన వివిధ భాష‌ల్లో కొత్త సినిమాల‌ను ఓటీటీల్లోకి తీసుకొచ్చారు. భార్య సినిమా తర్వాత సూర్య‌.. తాను న‌టించిన భారీ చిత్రం ఆకాశం నీ హ‌ద్దురాను సైతం అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయ‌డానికి సాహ‌సించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

ఇంత పెద్ద సినిమాకు థియేట్రిక‌ల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయ‌డం క‌రెక్టా అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ సూర్య ధైర్యం చేశాడు. అందుకు మంచి ఫ‌లితమే ద‌క్కింది. ఓటీటీ రిలీజ్‌ల్లో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఇదే.

అన్న స్ఫూర్తితో ఇప్పుడు త‌మ్ముడు కార్తి కూడా ఓటీటీ బాట ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. అత‌డి కొత్త సినిమా సుల్తాన్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంద‌ట‌. ఈ చిత్రాన్ని డిస్నీ+ హాట్ స్టార్ వాళ్లు కొంటున్నార‌ట‌. ఈ దిశ‌గా సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ట‌. త‌మిళ‌నాట థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం మాస్ట‌ర్ స‌హా చాలా సినిమాలు వ‌రుస‌లో ఉన్నాయి. వాటితో పోటీ ప‌డ‌టం క‌న్నా మంచి ఆఫ‌ర్ వ‌స్తే ఓటీటీ రిలీజే మేల‌ని నిర్మాత సురేష్ ప్ర‌భు భావిస్తున్నాడ‌ట.

ఖైదీ త‌ర్వాత కార్తి నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో దీనిపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో సుల్తాన్ తెర‌కెక్కింది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కన్నడ అమ్మాయి రష్మిక మందన్నా ఈ చిత్రంతోనే తమిళంలో అడుగు పెడుతుండటం విశేషం.