నలుగురు కుర్రాళ్ళు 100 కోట్లు లాగేశారు

తక్కువ బడ్జెట్ లో ఎక్కువ రోజులు షూటింగ్ చేయకుండా వేగానికి ప్రాధాన్యం ఇస్తూనే క్వాలిటీ మిస్ కాకుండా చూసుకోవడంలో మలయాళ దర్శకుల శైలి వేరు. మన దగ్గరేమో టయర్ 2 హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనమైపోయింది. అలాంటిది చిన్న ఆర్టిస్టులతోనే పెద్ద అద్భుతాలు చేయడం గత కొన్నేళ్లలో మలయాళ పరిశ్రమ బాగా నేర్చేసుకుంది. దానికి ఉదాహరణ గత వారం విడుదలైన వజా 2. టాలీవుడ్ నిర్మాత సాహూ గారపాటి ఇందులో భాగస్వామి కావడం విశేషం.

ఇంకా పది రోజులు కాకుండానే వజా 2 వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టేసింది. నవీన్ ఎస్ఏ దర్శకత్వం వహించిన ఈ యూత్ ఫుల్ డ్రామా నలుగురు కుర్రాళ్ళ చుట్టూ తిరుగుతుంది. స్కూల్ లో వేస్ట్ బ్యాచ్ గా పేరు తెచ్చుకున్న వీళ్ళను తల్లితండ్రుల నుంచి టీచర్ల దాకా తిట్టని వాళ్ళు ఉండరు. చదువు అయిపోయాక ఒకడు ఇండియాలో ఉంటే, మరొకడు కూలి పనుల కోసం దుబాయ్ చేరుకుంటాడు. మిగిలిన ఇద్దరు యుకె వెళ్లి జీవితంలో సెటిల్ కావడానికి కష్టపడుతూ ఉంటాడు.

మొత్తం మూడు చాప్టర్లుగా దీన్ని తీసిన నవీన్ సహజత్వానికి పెద్ద పీఠ వేశారు. సింపుల్ ఎమోషన్స్, క్లీన్ కామెడీ, విదేశాల్లో మన కురాళ్ళ పడే కష్టాలు, కుటుంబ సభ్యులతో ఏర్పడే అనుబంధాలు చాలా న్యాచురల్ గా ఉంటూ మెప్పిస్తాయి. చిన్న రివెంజ్ పాయింట్ జోడించి డిఫరెంట్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. థియేటర్ ఎపిసోడ్, పోలీస్ స్టేషన్ సీన్ విపరీతంగా నవ్విస్తాయి. ఎక్కడిక్కడ ఎంటర్ టైన్మెంట్ పరంగా ఎలాంటి లోటు లేకుండా ఆడియన్స్ కి టైం పాస్ చేయిస్తుంది.

అలాని అన్నీ పాజిటివ్స్ ఉన్నాయని కాదు. సెకండాఫ్ కొంత ల్యాగ్ అనిపిస్తుంది. వజా 1తో పోలిస్తే ఇందులో భావోద్వేగాలు తగ్గాయి. అయినా ఫన్ కు లోటు లేకుండా గడిచిపోయింది. ఇలాంటివి మన దగ్గర తీస్తే వర్కౌట్ అవుతాయా అంటే నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేస్తే ఖచ్చితంగా చూస్తారు. డబ్బింగ్ చేయడం కన్నా తెలుగులో ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టులతో మళ్ళీ తీయడమే మేలు. మరి సాహు గారపాటి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి.