మోసం మాటున ‘డెకాయిట్’ ప్రేమకథ

విలక్షణమైన కథలు ఎంచుకుంటాడని పేరున్న అడివి శేష్ సినిమా వచ్చి చాలా కాలమయ్యింది. హిట్ 2 ది సెకండ్ కేస్ తర్వాత దాని సీక్వెల్ లో చిన్న క్యామియో చేసి మాయమైపోయాడు. అందుకే డెకాయిట్ మీద ఫ్యాన్స్ కు ప్రత్యేక అంచనాలున్నాయి. షూటింగ్ ప్రారంభమైనప్పుడు ఉన్న శృతి హాసన్ స్థానంలో మృణాల్ ఠాకూర్ రావడం, కొంత రీ షూట్ చేయడం జరిగాయి. ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగింది. కథేంటో పెద్దగా దాచకుండా చెప్పే ప్రయత్నం చేసింది డెకాయిట్ టీమ్.

హరి (అడివి శేష్) ప్రాణంగా ప్రేమించే అమ్మాయి (మృణాల్ ఠాకూర్) గర్భం దాలుస్తుంది. పాప పుడుతుందని ఇద్దరూ బలంగా నమ్మిన టైంలో ఆమె చేసిన మోసం వల్ల హరి జైలుకు వెళ్తాడు. ప్రతీకార వాంఛతో రగిలిపోయి పోలీసుల నుంచి తప్పించుకుని తన దగ్గరకి వస్తాడు. తీరా చూస్తే కూతురు ప్రాణాల కోసం పోరాడుతూ హాస్పిటల్ లో ఉంటుంది. దాని కోసం డబ్బు సంపాదించడానికి హరి ప్రియురాలని క్రైమ్ పార్ట్ నర్ చేస్తాడు. తర్వాత ఏమైందనేది తెరమీద చూడాల్సిన అసలు స్టోరీ.

మంచి యాక్షన్ విజువల్స్ తో డెకాయిట్ ట్రైలర్ లో ఇంటెన్సిటి కనిపిస్తోంది. శేష్ ఈసారి మాస్ టచ్ లోకి వెళ్ళిపోయాడు. దొంగగా మారి పగతో రగిలిపోతూ, ఎంతకైనా తెగించే పాత్రలో కొత్తగా ఉన్నాడు. మృణాల్ ఠాకూర్ కు మరోసారి పెర్ఫార్మన్స్ చేయడానికి స్కోప్ దక్కినట్టు ఉంది. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ తదితర క్యాస్టింగ్ పెద్దదే ఉంది. పాప సెంటిమెంట్, క్రైమ్ రెండూ మిక్స్ చేసి దర్శకుడు షానియేల్ డియో డిఫరెంట్ ఇంప్రెషన్ అయితే తెచ్చుకున్నాడు.

ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న డెకాయిట్ ట్రైలర్ రూపంలో అంచనాలు పెంచడంలో సక్సెస్ అయినట్టే. ఇంతే డెప్త్ తో అసలు కంటెంట్ ఉందంటే మాత్రం శేష్ ఖాతాలో మరో క్రియేటివ్ సూపర్ హిట్ పడ్డట్టే. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చిన ఈ ప్యాన్ ఇండియా మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. దురంధర్ రివెంజ్ కోసం మార్చి 19 వదులుకున్న డెకాయిట్ ఇప్పుడు పెద్దగా పోటీ లేని అడ్వాంటేజ్ ని వాడుకోనుంది