ఈ విషయంలో రాజశేఖర్ సూపర్

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి సూపర్ హిట్స్ తో తొంభై దశకంలో మంచి మాస్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేసిన రాజశేఖర్ చాలా ఏళ్లుగా సోలో హీరోగా సినిమాలు చేయడం లేదు. ఆ మధ్య మలయాళ మూవీ జోసెఫ్ ని తెలుగులో జీవిత దర్శకత్వంలో శేఖర్ గా చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఓటిటి అమ్మకానికి కూడా నోచుకోలేదు. మొహమాటానికి నితిన్ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లో స్పెషల్ రోల్ చేస్తే ఇంకా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

జెన్ జీ తత్వం, తన మార్కెట్ త్వరగా అర్థం చేసుకున్న రాజశేఖర్ రియాలిటీలోకి వచ్చారు. బైకర్ లో శర్వానంద్ తండ్రిగా నటించడానికి ఒప్పుకోవడం ద్వారా తన సెలక్షన్ ఎలా ఉంటుందనే సంకేతం ఇండస్ట్రీకి స్పష్టంగా ఇచ్చారు. అసలు విశేషం ఇది కాదు. రాజశేఖర్ ఇందులో తాతయ్య అనిపించుకోవడానికి ఓకే చెప్పారు. కథ ప్రకారం రాజశేఖర్ కు శర్వా కొడుకుతో చివరి అరగంటలో కొన్ని సీన్లు, పాట ఉన్నాయి. ఎమోషనల్ ఫీల్ కోసం దర్శకుడు వాటిని పొందుపరిచారు.

ఆ చిన్న కుర్రాడు రాజశేఖర్ ని పదే పదే తాత తాత అని పిలుస్తూ ఉంటాడు. ఈయన సమకాలీకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మొదలైనవాళ్ళు తండ్రులుగా, అన్నయ్యలుగా నటించారు కానీ ఇప్పటిదాకా తాత అనిపించుకునే రిస్క్ చేయలేదు. వెంకటేష్ సూర్యవంశంలో ఒక్కసారి తాత పాత్ర చేశారు. మిగతా వారంతా నిజ జీవితంలో మనవళ్లు మనవరాళ్లు ఉన్నా స్క్రీన్ మీద తాత పిలుపుకి దూరంగా ఉన్నారు. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ తో ఆ రిస్కు చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.

సో రాజశేఖర్ ని ఈ విషయంలో సూపర్ అని మెచ్చుకోవచ్చు. బైకర్ కమర్షియల్ గా ఏ స్థాయికి వెళ్తుందనేది పక్కన పెడితే మంచి వెయిట్ ఉన్న పాత్రలు ఇస్తే వాటిని యాంగ్రీ మ్యాన్ నిలబెట్టేస్తారని అర్థమవుతోంది. బైకర్ లో సీరియస్ క్యారెక్టర్ కాబట్టి వేరియేషన్స్ కి ఎక్కువ స్కోప్ దక్కలేదు కానీ ఇతర దర్శకులు ఇతర షేడ్స్ ని కూడా వాడుకోవచ్చు. ఎలాగూ సాయికుమార్ డబ్బింగ్ చెబుతున్నారు కాబట్టి ఆ గొంతు రాజశేఖర్ కి వింటేజ్ ఫీల్ తీసుకొచ్చి మరింత డెప్త్ జోడిస్తుంది.