డైరక్టర్ ఐడియా బాగుంది.. బన్నీ ఒప్పుకుంటాడా?

‘ఆర్ఆర్ఆర్’… మెగా ఫ్యామిలీని, నందమూరి కుటుంబాన్ని ఒక్కటి చేసిన సినిమా. టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న చిరంజీవి తనయుడు రామ్ చరణ్, నందమూరి వారసుడు ఎన్టీఆర్ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ‘రుద్రం రణం రుదిరం’ చిత్రంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ వార్‌కి తెరదించారు జక్కన్న. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో మెగా మల్టీస్టారర్ ఐడియాతో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాడు డైరెక్టర్ స్వరూప్.

గత ఏడాది ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ మూవీతో టాలీవుడ్ జనాలను తెగ ఇంప్రెస్ చేశాడు యంగ్ డైరెక్టర్ స్వరూప్. సస్పెన్స్ థ్రిల్లర్‌కు పర్ఫెక్ట్ కామెడీని జోడించి, అటు ఆడియెన్స్‌ను ఇటు సినీ విమర్శకులను మెప్పించాడు. ఎన్టీఆర్, అల్లుఅర్జున్‌లతో ఓ మల్టీస్టారర్ మూవీ చేయాలని ఉందంటూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు స్వరూప్.

‘ఎన్టీఆర్, బన్నీ ఎనర్జీ లెవెల్స్ దాదాపు ఒకే రేంజ్‌లో ఉంటాయి. నటనలో కానీ, నాట్యంలో కానీ ఇద్దరూ ఇద్దరే… ఈ ఇద్దరితో ఓ మల్టీస్టారర్ తీయాలనేది నా కోరిక. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా…’ అంటూ ఇంట్రెస్టింగ్ కాంబో గురించి చెప్పాడు స్వరూప్.

స్వరూప్ ఆలోచన చాలా బాగుంది. స్క్రిప్ట్ నచ్చితే ఎన్టీఆర్ ఈ మల్టీస్టారర్ చేసేందుకు కచ్ఛితంగా ఒప్పుకుంటాడు కూడా. మరి బన్నీ ఒప్పుకుంటాడా? ఇంతకుముందు ‘వేదం’ సినిమాలో మంచు మనోజ్‌తో కలిసి నటించిన బన్నీ, అనుష్క ‘రుద్రమదేవీ’లోనూ స్పెషల్ రోల్ చేసి మెప్పించాడు. అయితే ఆ తర్వాత స్టార్ డమ్ పెంచే సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ పెద్దగా ప్రయోగాల జోలికి పోలేదు.

సోలో ఇమేజ్ తెచ్చుకుని పాన్ ఇండియా స్టార్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు స్టైలిష్ స్టార్. ఈ తరుణంలో తారక్‌తో బన్నీ స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఒప్పుకుంటాడా? ‘ఆర్ఆర్ఆర్’ పనుల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, తర్వాత త్రివిక్రమ్ సినిమా కమిట్ అయ్యాడు. అలాగే ప్రస్తుతం సుకుమార్‌తో ‘పుష్ఫ’ చేస్తున్న బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇంకా ఫిక్స్ కాలేదు. మరి స్వరూప్ ఈ ఇద్దరినీ మెప్పించే స్క్రిప్ట్‌తో వచ్చి, ఈ మెగా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించగలడో లేదో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే!