ఈ శుక్రవారం విడుదల కాబోతున్న రాకాస మీద టీమ్ మొత్తం ప్రాణాలు పెట్టేసుకుంది. నిర్మాత నీహారిక కొణిదెల చాలా యాక్టివ్ గా ప్రమోషన్లు చేస్తూ, అవసరమైతే టీమ్ తో కలిసి స్టేజి మీద డాన్స్ చేయడానికి కూడా వెనుకాడలేదు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యూనిట్ సభ్యుల మాటలు చూస్తే ఎంత కష్టపడ్డారో, ఎంత దూరం వచ్చారో అర్థమవుతుంది. సంగీత్ శోభన్ కు సోలో హీరోగా ఇదే మొదటి అతి పెద్ద బడ్జెట్ మూవీ. క్లిక్ అయ్యిందా వెంటనే మార్కెట్ పెరుగుతుంది.
హారర్ కామెడీ జానర్ లో రూపొందినప్పటికీ రాకాసలో ఊహించని అంశాలు చాలా ఉంటాయని దర్శక నిర్మాతలు ఊరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో మహిళా దర్శకులు విఫలమవుతున్నారు. వరుడు కావలెను, తెలుసు కదా, అన్నీ మంచి శకునములే లాంటివి లేడీ డైరెక్టర్స్ నుంచి వచ్చిన ఫెయిల్యూర్స్. ఇప్పుడీ నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత రాకాస దర్శకురాలు మానస శర్మ మీద ఉంది. చిన్న వయసులోనే పెద్ద ఛాలెంజ్ తీసుకుంది.
నీహారిక స్థాపించిన పింక్ ఎలిఫెంట్ బ్యానర్ మీద ఇకపై క్వాలిటీ సినిమాలే వస్తాయనే మాట నిలవాలంటే రాకాస పెద్ద హిట్టవ్వాలి. దానికి అనుగుణంగానే పబ్లిసిటీ ఘనంగా చేస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో చూస్తే బజ్ మరీ భారీగా అయితే లేదు. ఇలాంటి కంటెంట్లు మొదటి రోజే ఓపెనింగ్స్ తేవు. బాగుందనే టాక్ వస్తే సాయంత్రం ఆటకే పికప్ అయిపోయి మరుసటి రోజు నుంచి హౌస్ ఫుల్స్ పెడతాయి. విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2 లాంటివి ఉదాహరణగా చెప్పొచ్చు.
మరి రాకాస కనక ఈ టాస్కులో నెగ్గితే ఏప్రిల్ 10 దాకా ఫ్రీ గ్రౌండ్ దొరుకుతుంది. పోటీలో శర్వానంద్ బైకర్ ఉన్నప్పటికీ సంబంధం లేని జానర్ కావడంతో బయ్యర్లు టెన్షన్ పడటం లేదు. ఎలాగూ రెండు సినిమాలు ఆడేంత స్పేస్ బాక్సాఫీస్ దగ్గర ఉంది కాబట్టి వీటికి మంచి టాక్ రావాలని కోరుకుంటున్నారు. రాకాస రిలీజ్ కు ముందే అన్నయ్య వరుణ్ తేజ్ తో బరి మొదలుపెట్టిన నీహారిక ఇకపై ప్రొడక్షన్ ని సీరియస్ గా తీసుకుంటానని అంటోంది. రాకాస తనకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates